ఆంధ్ర ప్రదేశ్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. ఇంటింటి సర్వే ద్వారా మృతులు, నకిలీ, అక్రమంగా చేరిన పేర్లను తొలగిస్తామని తెలిపారు. ఒక్క నిజమైన ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగించకుండా కఠిన ధ్రువీకరణ చేపడతామని చెప్పారు.
‘ఓటరు జాబితాలో అనర్హులకు చోటుండకూడదు, అర్హులను జాబితా నుంచి తప్పించకూడదనే లక్ష్యంతో ఎన్యుమరేషన్ చేపడతాం’ అని భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 46,397 మంది బీఎల్‌వోలు జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సర్వే చేపడతారు. ఈ సందర్భంగా ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫాంలు ఇస్తారు. వాటిలో ఒక ఫాంను ఓటరు స్వయంగా పూర్తిచేసి ఇవ్వాలి. ఇక రెండోదానిపై బీఎల్‌వో సంతకం చేసి ఎక్నాలెడ్జ్‌మెంట్‌గా ఓటరుకు ఇస్తారు.
జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. అనంతరం నెల రోజుల పాటు క్లెయిములు, అభ్యంతరాలు స్వీకరిస్తాం. అనర్హులకు నోటీసులు జారీ చేసి రెండు నెలల్లో వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ దశలన్నీ పూర్తయిన తర్వాత సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని వివేక్ యాదవ్ వెల్లడించారు. 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత విభజిత రాష్ట్రంలో తొలిసారిగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతోంది.
ఈ ఏడాది జూలై 1ని ఎస్‌ఐఆర్‌కు క్వాలిఫయింగ్ తేదీగా ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. 2002 ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లు డీమ్డ్ టూ బీ ఎలక్టోరల్ కింద కొనసాగుతారు. వీరంతా ఎన్యుమరేషన్ ఫాం పూర్తిచేసి బీఎల్‌వోలకు అందించాలి. 2002 ఓటర్ల జాబితాలో లేకుండా ప్రస్తుత జాబితాలో ఉన్న వారు ఎన్యుమరేషన్ ఫాంతో పాటు ఎన్నికల సంఘం ప్రకటించిన 12 ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాకముందే ప్రీ మ్యాపింగ్ నిర్వహించామని వివేక్ యాదవ్ తెలిపారు. ‘ప్రస్తుతం ఉన్న జాబితా ప్రకారం ఏపీలో 4,16,18,359 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,68,86,239 (64.6శాతం) మంది 2002 నాటి ‘సర్’లో నమోదయ్యారు. మరో 1,47,32,120 మంది ఆ తర్వాత ఓటర్లుగా నమోదు చేసుకొని ప్రస్తుత జాబితాలో ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 46,397 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి కేంద్రం పరిధిలో 1,000 నుంచి 1,200 ఓట్లకు మించకుండా హేతుబద్ధీకరిస్తారు. జూలై 14 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. సర్‌లో భాగంగా ప్రతి బీఎల్‌వో తమ బూత్ పరిధిలోని ప్రతి ఇంటికి మూడుసార్లు తప్పనిసరిగా వెళ్తారు. పోలింగ్ బూత్‌లకు బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్‌ఏ)ను రాజకీయ పార్టీలు నియమించుకుంటే బీఎల్‌వోలతో సమన్వయం పెరుగుతుంది.

More Stories
ఐదో తరం విమానాలు గగనంలో ఎగరబోతున్నాయి
ఏపీలో వారానికి ఒకరోజు నో వెహికల్ డే
“డిజిటల్ భారత్ నిధి” పథకం కింద ఏజెన్సీ ప్రాంతాల్లో 5జీ సేవలు