విజయవంతంగా జీఎస్‌ఎల్వీ ఎఫ్-12 రాకెట్ ప్రయోగం

శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్వీ ఎఫ్-12 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సోమవారం ఉదయం షార్ రాకెట్ ప్రయోగ కేంద్రంలోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి సరిగ్గా 10:42 గంటలకు నిప్పులు చెరుగుతూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆపై నిర్ణీత సమయంలో ఎన్‌వీఎస్ – 01 ఉపగ్రహాన్ని రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
 
రాకెట్ విజయవంతంతో స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ఉపగ్రహం దేశీయ నేవిగేషన్ సేవలు అందించనుంది. జీఎస్ఎల్వీ ఎఫ్ – 12 రాకెట్ పొడవు 51.7 మీటర్లు, బరువు 420 టన్నులు. 2,232 కిలోల బరువున్న ఎన్‌వీఎస్‌-01 జీవితకాలం 12 ఏళ్లు.
 
రాకెట్ ప్రయోగం సక్సెస్ అవడంతో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మిషన్ కంట్రోల్ సెంటర్‌లో శాస్త్రవేతలు సంబరాలు చేసుకుంటున్నారు. సహచర శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ డా.సోమనాథ్ అభినందించించారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ జీఎస్‌ఎల్వీ ఎఫ్-12 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని తెలిపారు.
 
ఇది ఇస్రో సభ్యుల కృషి వల్లే సాధ్యమైందని పేర్కొంటూ ఎన్‌వీఎస్ – 01 ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరిందని చెప్పారు. రాకెట్ ప్రయోగంలో క్రయోజనిక్ స్టేజి చాలా కీలకమైందని, ఆ స్టేజ్‌ కూడా సవ్యంగా సాగిందని ఇస్రో చైర్మన్ డా.సోమనాథ్ పేర్కొన్నారు. ఈ ప్రయోగం ద్వారా భారత నావిగేషన్‌ వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. నావిగేషన్‌ సేవల కోసం గతంలో పంపిన వాటిలో నాలుగు ఉపగ్రహాల జీవిత కాలం ముగిసిందని, వాటి స్థానంలో ప్రతి ఆరు నెలలకు ఒక ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపుతున్నామని సోమనాథ్‌ వెల్లడించారు.

నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్ (NavIC) పేరుతో ఇస్రో అభివృద్ధి చేసిన ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇది. కక్ష్యలో ఉన్న ఏడు ఉపగ్రహాల సమూహం కాగా, ఇది గ్రౌండ్ స్టేషన్‌లతో కలిసి పని చేయనుంది. ఇక నెట్‌వర్క్ సాధారణ వినియోగదారులు, వ్యూహాత్మక వినియోగదారులకు నావిగేషనల్ సేవలను కూడా ఈ శాటిలైట్​ అందిస్తుంది.

సాయుధ దళాలు, మెరుగైన పొజిషనింగ్, నావిగేషన్ అండ్‌ టైమింగ్ కోసం దేశంలో పౌర విమానయాన రంగానికి పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థను ఇస్రో అభివృద్ధి చేసింది. రెండో తరం నావిగేషన్ శాటిలైట్ సిరీస్‌లో ఎన్ వి ఎస్ -1 ఇది మొదటిదని ఇస్రో తెలిపింది. ఇది లెగసీ NavIC సేవల కొనసాగింపును నిర్ధారిస్తుందని, Li బ్యాండ్‌లో కొత్త సేవలను అందించనున్నట్టు ఇస్రో అధికారులు వెల్లడించారు.

భారతదేశానికి చెందిన రెండో తరం నావిక్‌ ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్‌-01 మొదటిది. ఈ ఉపగ్రహంలో రుబిడియం అణుగడియారం ఉంది. ఈ టెక్నాలజీని భారత్‌ సొంతంగా అభివృద్ధి చేసింది. అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌లో నిర్మించారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న పలు ఉపగ్రహాలు అటామిక్‌ క్లాక్‌ పనిచేయడం మానేయగానే డేటా పంపడం ఆపేస్తాయి. కచ్చితమైన ట్రాకింగ్‌ను కూడా అందించలేవు. 2018లో కూడా ఇలా పనిచేయని ఉపగ్రహాన్ని మరో శాటిలైట్‌ పంపి భర్తీ చేశారు. ప్రస్తుతం నాలుగు ఐఆర్‌ఎన్‌ఎస్‌ ఉపగ్రహాలు మాత్రమే లొకేషన్‌ సర్వీసులను అందిస్తున్నాయి.

రెండో తరం నావిక్‌ ఉపగ్రహాలు ఎల్‌1 సిగ్నల్స్‌ను పంపగలవు. దీంతో ఉపగ్రహ ఆధారిత నేవిగేషన్‌ వ్యవస్థలు మరింత మెరుగ్గా పనిచేసేందుకు ఉపయోగపడుతాయి. దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రాంతీయ నేవిగేషన్‌ వ్యవస్థలను తక్కువ విద్యుత్తు, సిగ్నల్‌ ఫ్రీక్వెన్సీ ఉన్న చిప్స్‌ అమర్చే పరికరాల్లో, పర్సనల్‌ ట్రాకర్లలో మరింత మెరుగ్గా వినియోగించుకొనే అవకాశం లభించనుంది.