అవినీతికి తావులేకుండా పారదర్శకంగా మోదీ పాలన

గత యూపీఏ హయాంలో అవినీతి తాండవించేదని, అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా అవినీతికి తావులేని రీతిలో పారదర్శకంగా నరేంద్ర మోదీ పాలనను అందిస్తున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్  తెలిపారు.  ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొంటూ బాంబు బ్లాస్టులు, అలజడి లేకుండా శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నారని చెప్పారు.

కరోనా వ్యాక్సిన్ అందించి దేశ ప్రజల ప్రాణాలను కాపాడటంతో పాటు దాదాపు 50 దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించారని గుర్తు చేశారు. పీఎం అవాస్ యోజన కింద 3.5 కోట్ల ఇండ్లను నిర్మించారని చెబుతూ ఇది  ఇందిరా ఆవాస్ యోజన కంటే మెరుగైన పథకమని తెలిపారు. ఇది వరకు ఇంటి నిర్మాణం కోసం మూడు విడత సాయం చేసేవాళ్లని, అది కూడా కలెక్టరేట్ కు సర్టిఫికేట్ సమర్పించాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు  టెక్నాలజీని ఉఫయోగించుకుని జియో ట్యాగింగ్ ద్వారా లబ్దిదారుడికి ఇబ్బంది లేకుండా చేశామని చెప్పారు.

దేశవ్యాప్తంగా 11 కోట్ల 72 లక్షల మందికి టాయిలెట్లను నిర్మించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెడతానని ఎర్రకోట నుండి ప్రసంగిస్తూ 10 కోట్ల టాయిలెట్లను నిర్మిస్తున్నట్లు ప్రకటించి, అనుకున్న లక్ష్యానికంటే అధికంగా నిర్మించారని తెలిపారు.
స్వచ్ఛ భారత్ మిషన్ కింద పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారని,  అత్యంత కంపు కొడుతున్న రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి శుభ్రం చేశారని చెప్పారు. 

జల్ జీవన్ మిషన్ కింద 12 కోట్ల ఇండ్లకు నల్లాల ద్వారా శుద్ద మంచినీరు అందించామని పేర్కొంటూ గతంలో మంచి నీళ్ల కోసం 5 కి.మీల దూరం నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకునే దుస్థితి ఉండేదని, ఇప్పుడా పరిస్థితి లేదని కేంద్రమంత్రి గుర్తు చేశారు.  ఉజ్వల యోజన కింద 9 కోట్ల 60 లక్షల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించామంటూ వాస్తవానికి ఇది ఇన్నోవేటివ్ పథకమని చెప్పారు.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కరోనా సమయంలో 80  కోట్ల మందికి ప్రతినెలా ఉచితంగా రేషన్ అందించామని పేర్కొన్నారు.  జన్ ధన్ యోజన ఖాతా ఉన్న వాళ్లకు కరోనా సమయంలో ఇంట్లో ఉన్నప్పటికీ పెన్షన్ నేరుగా ఖాతాలో జమ చేశామని వెల్లడించారు.  ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అత్యధిక పెద్ద పథకమని పేర్కొంటూ  ఈ పథకం కింద కార్డు కలిగిన వాళ్లు ఆసుపత్రిలో చేరితే రూ.5 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందించారని, ప్రపంచ దేశాలు ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని అధ్యయనం చేస్తున్నారని మేఘవాల్  తెలిపారు. 
 
జన ఔషధి కేంద్రాల ద్వారా 9 వేల 3 వందలకుపైగా రకాల మందులను చౌక ధరకే అందిస్తున్నారని చెబుతూ మార్కెట్లో  రూ. 100లకు లభించేది ఇక్కడ రూ. 15 కే అందిస్తున్నామని చెప్పారు. ఇది మెడిసన్ కాదు.. మోడీసన్ అంటూ అభివర్ణించారు.  ఎరువుల కొరత లేకుండా చేస్తున్నామంటూ రూ. 6338 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్దరించి రైతులకు కొరత లేకుండా ఎరువులు అందిస్తున్నామని, పెద్ద ఎత్తున సబ్సిడీపై ఎరువులను రైతులకు అందిస్తున్నామని వివరించారు.