టిఎస్‌పిఎస్‌సి కేసులో బ్లూటూత్లో విని అన్సర్లు రాసిన నిందితులు

టీఎస్పీఎస్సీలో మరో సంచలనం వెలుగు చూసింది. పేపర్ లీకేజీ నిందితులు అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ డివైజ్‌తో పరీక్ష రాసినట్లు సిట్ అధికారులు తేల్చారు. ఏఈఈ పరీక్ష రాసిన ముగ్గురు అభ్యర్థులు టెక్నాలజీ సాయంతో కాపీయింగ్‌కు పాల్పడ్డట్లు తేలగా.. ఇలాంటి వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు సిట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎలక్ట్రానిక్ డివైజ్ తో ఎగ్జామ్ రాసిన నిందితులు ప్రశాంత్‌, మహేశ్‌, నవీన్‌లను అరెస్ట్‌ చేశారు.

శనివారం వరంగల్‌లో అరెస్టయిన విద్యుత్తు డీఈ రమేశ్‌ అలియాస్‌ రవీందర్‌ ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి అని వెల్లడించాయి. ఈ కేసులో ఏ12గా ఉన్న సురేశ్‌ గ్యాంగ్‌కు చెందిన పూల రవికిశోర్‌ నుంచి ఏఈఈ మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసిన డీఈ రమేశ్‌ అలియాస్‌ రవీందర్‌.. దాన్ని పలువురికి భారీ మొత్తానికే అమ్మినట్లు సిట్‌ గుర్తించింది.

పరీక్ష సమయంలో  నిందితులకు రమేష్‌ ఆన్సర్లు చెప్పారని అధికారులు వెల్లడించారు. రమేష్ సమాధానాలు చెప్తుంటే నిందితులు బ్లూటూత్‌లో విని రాసినట్టు సిట్‌ అధికారులు గుర్తించారు. కట్టుదిట్టంగా నిర్వహించే పరీక్ష హాల్‌లోకి ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు ఎలా వెళ్లాయనే దానిపై సిట్ అధికారులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. 

టీఎస్పీఎస్సీలో రమేష్ ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేశాడు. టీఎస్పీఎస్సీ కేసులో ఇప్పటికే  రమేష్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.   ఇప్పటికే 45 మందిని అరెస్టు చేయగా, సోమవారం మరో ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.  హైదరాబాద్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న రమేశ్‌  ఇక్కడ కూడా 20 మందికి ప్రశ్నపత్రాన్ని విక్రయించినట్లు ఆధారాలు సేకరించిన సిట్‌.. వారి గురించిన ఆరా తీస్తున్న క్రమంలో ప్రశాంత్‌, నరేశ్‌ అలియాస్‌ నవీన్‌, మహేశ్‌ను అదుపులోకి తీసుకుని, విచారించింది.

ఈ క్రమంలో హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రంలో ఈ ముగ్గురూ చెవుల్లో బ్లూటూత్‌/వైఫై డివైజ్‌ ద్వారా మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడ్డట్లు, తమకు సమాధానాలను రమేశ్‌ అలియాస్‌ రవీందర్‌ చేరవేసినట్లు సిట్‌ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. దీంతో టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో మెుత్తం అరెస్టుల సంఖ్య 48కు చేరింది.  వీరికేనా ఇంకా ఎవరికైనా రమేష్ పేపర్ విక్రయించాడా? ఎలక్ట్రానిక్ డివైజ్ వాడి ఇంకెంత మంది టిఎస్‌పిఎస్‌సి ఎగ్జామ్ రాశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.