జులైలో చంద్రయాన్ – 3 ప్రయోగం

చంద్రుడిపై ప్రయోగాల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ – 3ను జులై 12న ప్రయోగించేందుకు ప్రణాళిక వేసుకున్నట్టు ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. జీఎస్ఎల్వీ ఎఫ్12  రాకెట్ ను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపిన ప్రయోగం విజయవంతం అయిన తర్వాత చంద్రయాన్ గురించి సోమనాథ్ ఈ వివరాలను వెల్లడించారు.

చంద్రయాన్ రోవర్‌ను ఆగస్టు 23వ తేదీన చంద్రుడిపై ల్యాండ్ అయ్యేలా ప్రణాళికలను వేసుకున్నామని, అన్నీ సవ్యంగా సాగుతాయని ఆశిస్తున్నట్లు సోమనాథ్ పేర్కొన్నారు. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ చేయాలనేదే తమ ప్రయత్నమని వివరించారు. జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌ మార్క్-3 ద్వారా రోవర్‌ను చంద్రుడిపైకి పంపిస్తామని చెప్పారు.
 
గతంలో చేపట్టిన చంద్రయాన్ 2 విఫలమైన విషయం తెలిసిందే. ఇందులో భాగమైన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగు పెట్టలేకపోయింది. చిట్ట చివరి నిమిషంలో గతి తప్పింది. 2019 సెప్టెంబర్ 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 నుంచి 2:30 గంటల మధ్యలో చంద్రుడిపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు స్తంభించిపోయాయి.
 
ఆ తరువాత అది క్రాష్ ల్యాండ్ అయింది. ఉత్తర ధృవం వైపు కూలింది. ఇప్పుడు తాజాగా చంద్రయాన్ 3 మిషన్ ను చేపట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. ల్యాండర్‌ను చంద్రుడిపైకి మోసుకెళ్లడానికి అవసరమైన లాంచింగ్ వెహికల్ క్రయోజనిక్ ఇంజిన్ సీ-20ని విజయవంతంగా పరీక్షించారు. 25 నిమిషాల పాటు దాన్ని మండించారు.
 
తమిళనాడులోని మహేంద్రగిరిలో గల ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్ లో టెస్ట్ ఫైర్ ఇదివరకే పూర్తయింది చంద్రయాన్ – 3 కి ఉపయోగించే ఎల్వీఎం రాకెట్ ను ప్రస్తుతం రూపొందిస్తున్నారు.
మరోవైపు చంద్రయాన్ – 2 ద్వారా పంపిన ఆర్బిటర్ ఇప్పటికీ పని చేస్తోంది. చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఈ ఆర్బిటర్ హై రెజల్యూషన్ ఇమేజీలను పంపుతోంది. కాగా, చంద్ర‌యాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌లో మొత్తం మూడు ర‌కాల మాడ్యూల్స్ ఉంటాయి. ప్రొప‌ల్ష‌న్ మాడ్యూల్‌, ల్యాండ‌ర్ మాడ్యూల్‌, రోవ‌ర్ మాడ్యూల్ ఉండ‌నున్నాయి.

ఇప్ప‌టికే ఇస్రో రెండు సార్లు చంద్రుడిపైకి వ్యోమ‌నౌక‌ల‌ను పంపిన విష‌యం తెలిసిందే. బెంగుళూరులో యూఆర్ రావు శాటిలైట్ సెంట‌ర్‌లో రూపుదిద్దుకున్న మూన్ శాటిలైట్ ఇప్ప‌టికే శ్రీహ‌రికోట‌కు చేరుకున్న‌ది.