యాసిన్‌ మాలిక్‌కు మరణ శిక్ష విధించాలన్న ఎన్‌ఐఏ

జమ్ముకశ్మీర్‌ వేర్పాటువాద నేత, జేకేఎల్‌ఎఫ్‌ చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌కు  మరణ శిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డిమాండ్‌ చేసింది. ఉగ్రవాద నిధుల కేసులో ట్రయల్‌ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించింది. యాసిన్‌ మాలిక్‌ తన నేరాలను అంగీకరించి శిక్షలపై కోర్టును వేడుకోవడంతో మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది.
ఈ నెల 26న ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టులో ఎన్‌ఐఏ సవాల్‌ చేసింది. యాసిన్ మాలిక్‌ కేసును అరుదైన కేసుగా పరిగణించి ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేసింది. కరుడుగట్టిన ఉగ్రవాదికి ఉరి శిక్ష విధించకపోతే న్యాయం జరుగదని పేర్కొంది.  న్యాయమూర్తులు సిద్ధార్థ్ మృదుల్, తల్వంత్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఎన్‌ఐఏ అపీల్‌పై సోమవారం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఎన్‌ఐఏ తరుఫున వాదించారు. నిందితుడు చాలా చాకచక్యంగా తన నేరాన్ని అంగీకరించాడని, ఇలాగే కొనసాగితే ఉగ్రవాదులు తమ నేరాన్ని అంగీకరించి కఠిన శిక్షల నుంచి తప్పించుకుంటారని చెప్పారు. ‘ఒసామా బిన్ లాడెన్‌ను ఇక్కడ విచారిస్తే, అతడు కూడా తన నేరాన్ని అంగీకరించేందుకు అనుమతించేవారు’ అని వ్యాఖ్యానించారు.

కాగా, న్యాయమూర్తి సిద్ధార్థ్ మృదుల్‌ దీనిని ఖండించారు. బిన్‌ లాడెన్‌ ఎక్కడా కూడా కేసు విచారణ ఎదుర్కోలేదని గుర్తు చేశారు. అలాగే యాసిన్‌ మాలిక్‌ కేసు భిన్నమైందని, ఆయనను బిన్‌ లాడెన్‌తో పోల్చలేమని తెలిపారు.  దీనిపై స్పందించిన తుషార్ మెహతా, బహుశా అమెరికా చేసిన పని (లాడెన్‌ను గుట్టుగా హతమార్చడం) సరైనదని పేర్కొన్నారు.

అయితే విదేశీ అంశాలపై వ్యాఖ్యానించేందుకు తాము ఇక్కడ లేమని న్యాయమూర్తి మృదుల్‌ బదులిచ్చారు. మరోవైపు ప్రస్తుతం తీహార్‌ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న యాసిన్‌ మాలిక్‌ను ఆగస్ట్‌ 9న తమ ఎదుట హాజరుపర్చాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి వారెంట్‌ను జారీ చేసింది.  అలాగే ఉరి శిక్ష విధించాలన్న ఎన్‌ఐఏ డిమాండ్‌పై కూడా ఆయనకు మరో నోటీసు జారీ చేసింది. ఈ నోటీసులను జైలు సూపరింటెండెంట్ ద్వారా యాసిన్‌ మాలిక్‌కు అందజేయాలని ఆదేశించింది. ఎన్‌ఐఏ అపీల్‌పై తదుపరి విచారణను ఆగస్ట్‌ 9కి వాయిదా వేసింది.