ఏషియన్ గేమ్స్ ట్రయల్స్‌లో పోటీపడే అంశంలో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఎంపిక ప్రక్రియలో ఆమె పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. ఈ నెల 30, 31 తేదీల్లో ఏషియన్ గేమ్స్ సెలెక్షన్ ట్రయల్స్‌లో వినేశ్ ఫొగాట్ పోటీ పడేందుకు ఇటీవల ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను డబ్ల్యూఎఫ్ఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
హైకోర్టు తన పరిధిని మీరిందని, ఎంపిక ప్రమాణాల ప్రకారం వినేశ్ అనర్హురాలని పేర్కొంది. డబ్ల్యూఎఫ్ఐ పిటిషన్‌ను విచారించిన సుప్రీం డిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ స్థానంలో వేరొకరు ఉండి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదని, కానీ వినేశ్ ఈ దేశాన్ని గర్వపడేలా చేశారని వెల్లడించింది. ఇప్పటికే ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఆమెకు హైకోర్టు అనుమతి ఇచ్చిందన్న అత్యున్నత న్యాయస్థానం ఈ దశలో వినేశ్‌ను వెనక్కి వెళ్లమని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించింది.
ప్రస్తుతానికి ఈ విషయంలో తాము ఏం చేయలేమని ఆమె పోటీల్లో పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో రెజ్లింగ్ లో పలుమార్లు దేశానికి గర్వకారణంగా నిలిచిన వినేష్ కి ఒక అవకాశం కల్పించాల్సి వుందని జస్టిస్ పి.ఎస్.నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఆమె ట్రయల్స్‌కు హాజరు కాలేదని, ఆమె ఆచూకీ తెలియలేదని విచారణ సమయంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యు ఎఫ్ ఐ) వాదించింది.
‘‘మేం ఈ విషయంలో జోక్యం చేసుకోలేం. మీరు వెళ్లి ఆసియా గేమ్స్ ట్రయల్స్‌లో పాల్గొనవచ్చు. ఈ దశలో వెనక్కి రావాలని వినేష్‌కు ఆదేశాలివ్వలేం. ఆమె గతంలో దేశాన్ని గర్వపడేలా చేశారు. ఇప్పటికే కోర్టు వినేష్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో ఇంకేం చేయలేం” అని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.
ఆమె తల్లి అయ్యారని, హర్యానా ఎమ్మెల్యేగా తన విధుల్లో నిమగ్నమై ఉన్నారని ఫోగట్ తరపున సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ పేర్కొన్నారు. ఆమె మొదటి సారి తల్లి అయ్యారని, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం వినేష్ ఫోగట్ కేవలం సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం కోసమే ప్రయత్నిస్తున్నారని మాధవి దివాన్ తెలిపారు. ఐతే డబ్ల్యూఎఫ్ఐ పిటిషన్‌పై వినేశ్‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.

More Stories
సిజెపి ఎక్స్ ఖాతా పునరుద్ధరించేందుకు హైకోర్టు తిరస్కారం
ప్రధాని కార్యాలయం పర్యవేక్షణలో నీట్ పిజి రీటెస్ట్!
సిద్ధరామయ్య తొలగింపు ఓబిసిలకు ద్రోహం చేయడమే