కర్ణాటక ఫార్ములాతో రాజస్థాన్ లో కాంగ్రెస్ గట్టెక్కేనా!

మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్ లో  అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో నెలకొన్న కుమ్ములాటలను కట్టడి చేసేందుకు పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తీసుకున్న చొరవ ఏమేరకు ప్రయోజనం చేకూరుస్తుందో చూడవలసి ఉంది.  కర్ణాటకలో సంవత్సరం ముందే రెండు వారి వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య సయోధ్య కుదిర్చి, కలసి పనిచేసేటట్లు చేయడం ద్వారా అక్కడ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించగలిగింది.
 
ఇప్పుడు అదే ఫార్ములాను ఆరు నెలల ముందు రాజస్థాన్ లో ప్రయోగించే ప్రయత్నం పార్టీ ఖర్గే చేస్తున్నారు. అయితే రాజస్థాన్ లో కాంగ్రెస్ వర్గాల మధ్య దూరం బాగా పెరగడంతో ఇక్కడ ఆ ఫార్ములా పనిచేయడంపై ఆ పార్టీ వారే సందేహం వ్యక్తం చేస్తున్నారు.  ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ లు పరస్పరం మాటల యుద్ధం చేసుకొంటున్న తరుణంలో సోమవారం వారిద్దరిని పిలిపించి, సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. 
రాహుల్ గాంధీ సమక్షంలో నాలుగు గంటల సేపు జరిగిన ఈ సమాలోచనలు అనంతరం వారిద్దరూ కలిసి వచ్చే ఎన్నికలలో పోరాడేందుకు అంగీకరించారని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ మీడియాకు చెప్పారు.  చాలాకాలం తర్వాత వారిద్దరూ కలిసి కూర్చోవడం గమనార్హం. ఇద్దరు కలిసి రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు రావడానికి నిర్ణయించారని తెలిపారు.  అంతకు ముందు ఖర్గే వారిద్దరితో వ్యక్తిగతంగా విడివిడిగా మాట్లాడారు.
 
డిసెంబర్ లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల అనంతరమైనా తాను ఆశిస్తున్న ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీ అధిష్టానం నుండి సచిన్ హామీ కోరుతున్నారు. అయితే గెహ్లాట్ మాత్రం పడనీయడం లేదు.  దానితో సచిన్ ఆసనంగా వ్యవహరిస్తున్నారు. అందుకనే ఈ రాజీ ప్రయత్నం ఏమేరకు అమలవుతుందో చూడాల్సి ఉంది.
 
ఈ భేటీకి ముందే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా దృఢంగా ఉంటుందని, ఏ నాయకులను లేదా కార్యకర్తలను శాంతింప చేయడానికి పదవులు ఇచ్చే సంప్రదాయం పార్టీలో లేదని స్పష్టం చేయడం ద్వారా గెహ్లాట్ పరోక్షంగా పైలట్ ను హెచ్చరించినట్లు అయింది.  తాను చేసిన మూడు డిమాండ్లు ఈ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతానని సచిన్‌పైలట్ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటమ్ విధించడంతో ఈ సమావేశం తక్షణం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వసుంధర రాజే హయాంలో రాజస్థాన్‌లో జరిగిన అవినీతిపై ఉన్నతస్థాయి దర్యాప్తు నిర్వహించాలని పైలట్ చేస్తున్న డిమాండ్లలో ఒకటి. ఈ నేపథ్యంలో గెహ్లాట్ నేతలను బుజ్జగించడానికి పదవులు ఇచ్చే సంప్రదాయం పార్టీలో లేదని వ్యాఖ్యానించడం గమనిస్తే పుండుమీద కారం పోసినట్లయింది. పైలట్‌ను శాంతింప చేసే ఫార్ములా ఏదో ఉంటుందా అన్న విలేఖర్ల ప్రశ్నకు గెహ్లాట్ అలాంటిదేమీ లేదని కొట్టి పారేశారు. కాంగ్రెస్‌లో ఇంతవరకు అలాంటిదేమీ జరగలేదని, ఇకముందు కూడా జరగబోదని స్పష్టం చేశారు.

రాజస్థాన్‌లో 2018లో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన దగ్గర నుంచి గెహ్లాట్, పైలట్ మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది.  2020లో పార్టీ రాష్ట్ర అధ్యక్షపదవి, డిప్యూటీ సిఎం పదవి నుంచి పైలట్‌ను తప్పించిన దగ్గర నుంచి గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పైలట్ పోరు సాగిస్తున్నారు.