నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించడంతో జూన్ 21 నిర్వహించే రీటెస్ట్లో మరోసారి ఎలాంటి లోపాలు తలెత్తకుండా కేంద్రం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఈసారి రీటెస్ట్ ప్రక్రియను ప్రధానమంత్రి కార్యాలయం నిశితంగా పరిశీలిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పేపర్ తయారీ నుంచి ఫలితాల వరకు నిశితంగా పరిశీలించనుంది.
డిల్లీలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తన నివాసంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నీట్ రీటెస్ట్‌లో ఎలాంటి అవకతవకలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈసారి ఎలాంటి లోపాలకు తావు లేకుండా ప్రశ్న పత్రాల తరలింపు కోసం వైమానిక దళాన్ని వినియోగించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది.
సుమారు 40 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, పీఎంఓ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేపర్ తయారు చేయడం, ప్రింటింగ్, ట్రాన్స్‌పోర్టేషన్, పరీక్షా కేంద్రాలకు చేర్చడం వంటి ప్రతి ప్రక్రియను ప్రధాన మంత్రి కార్యాలయం పిఎంఓ) పర్యవేక్షించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
నీట్ రీ టెస్ట్కు సంబంధించిన పరిణామాలను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించి ప్రతి అప్‌డేట్‌ను మోదీ తెలుసుకుంటున్నారని వివరించాయి. మే 3న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షను పేపర్ లీక్ అయ్యిందన్న కారణంతో మే 12న రద్దు చేశారు. అనంతరం జూన్ 21న రీ-టెస్ట్ పెడతామని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తామని తెలిపారు.
మరోవంక, నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. భారతదేశపు అతిపెద్ద వైద్య ప్రవేశ పరీక్ష విశ్వసనీయతపై దేశవ్యాప్త ఆగ్రహం, నిరసనలు, రాజకీయ దాడులకు దారితీసిన వివాదం పునరావృతం కాకుండా నిరోధించడమే ఈ కొత్త పర్యవేక్షణ యంత్రాంగం లక్ష్యంగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
పేపర్ లీక్, గోప్యమైన పరీక్ష పత్రాలు విద్యార్థుల వద్దకు చేరడానికి ముందు పలు దశల గుండా ఎలా ప్రయాణించాయనే దానిపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. ఇప్పుడు, జూన్ 21న జరగనున్న నీట్ పునఃపరీక్ష కోసం లక్షలాది మంది అభ్యర్థులు మళ్లీ సిద్ధమవుతున్న తరుణంలో, ప్రభుత్వం చిన్నపాటి పొరపాటును కూడా నివారించడానికి నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా, నీట్ యూజీ అభ్యర్థుల పరీక్ష ఫీజు రీఫండ్ ప్రక్రియకు సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాల సమర్పణ గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. మే 27తో ముగియాల్సిన ఈ గడువును 2026 జూన్ 22 వరకు పొడిగిస్తూ ఎన్‌టీఏ ప్రకటించింది. అభ్యర్థులు నీట్ 2026 రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా తమ బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పించి, నేరుగా తమ ఖాతాల్లోకి ఫీజు రీఫండ్ పొందవచ్చు.

More Stories
రామమందిర `విరాళాల చోరీ’ దోషులను వదిలే ప్రసక్తి లేదు
కంటోన్మెంట్లో 21 రోడ్లకు బ్రిటీషర్ల స్థానంలో భారితీయ వీరుల పేర్లు
జార్ఖండ్‌లో ఎన్డీఏ అభ్యర్థి నత్వానీ గెలుపుతో రాజ్యసభలో 2/3 ఆధిక్యత