డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ ఇప్పుడే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సూచించారు. రూపాయి మారకం రేటు మరికొంత పతనం అయ్యే వరకు ఎదురు చూడాలని ఆయన కోరారు. డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనాన్ని ఆపేందుకు ఆర్‌బీఐకి ద్రవ్య పరపతి విధానం ఆఖరి అస్త్రం కావాలే తప్ప తొలి అస్త్రం కాకూడదని సుబ్బారావు స్పష్టం చేశారు.
ఇలా చేయడం ద్వారా దిగుమతుల పెరుగుదలతో ఎదురయ్యే చెల్లింపుల సమస్య వంటి బయటి ఒత్తిళ్ల నుంచి సహజ రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. పెరిగే ధరల నియంత్రణకు రెపో రేటు పెంచడం మేలనే సూచనలనీ ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుత తరుణంలో రిటైల్ ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీ రేట్లు పెంచడం కంటే ద్రవ్య సరఫరా నియంత్రణ చర్యలు మేలని చెప్పారు.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష కోసం ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) వచ్చే నెల 3-5 తేదీల మధ్య సమావేశమవుతోంది. ఈ సమావేశంలో కీలక రెపో రేటు పెంపుపైనా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ధరల నియంత్రణకు మరో మార్గం లేదనుకున్నప్పుడు మాత్రమే ఆర్‌బీఐ కీలక రెపో రేటు పెంచాలని ఆయన చెప్పారు.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో డాలర్‌తో రూపాయి మారకం రేటు ఈ నెల ప్రారంభంలో ఒక దశలో రూ.97.15కు పడిపోయింది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం నుంచి డాలర్‌తో రూపాయి మారకం రేటు తగ్గుతూ వస్తున్నది.ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 6.1 శాతం పతనమైతే, అందులో 5 శాతం గల్ఫ్ యుద్ధం ప్రారంభం నుంచి జరిగింది. ఈ యుద్ధానికి వెంటనే తెరపడకపోతే డాలర్‌తో రూపాయి మారకం రేటు త్వరలోనే సెంచరీ కొడుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.
సంక్షోభ సమయాల్లో రూపాయి మారకం రేటు స్థిరీకరణ ఆర్‌బీఐకి పెద్ద సవాల్ అని సుబ్బారావు తెలిపారు. ‘మారకం రేటు సంక్షోభాలు కేంద్ర బ్యాంకులపై నమ్మకాన్నీ దెబ్బతీస్తాయి. రూపాయి మారకం రేటు మరింత పడిపోతుందని మదుపరులు, దిగుమతిదారులు, గృహస్థులు నమ్మితే, ఎగుమతిదారులు మాత్రం తమ ఎగుమతుల ఆదాయాన్ని వెంటనే వెనక్కి తీసుకు రాకుండా ఆలస్యం చేస్తారు’ అని పేర్కొన్నారు.
`దిగుమతిదారులు డాలర్ల కోసం ఎగబడతారు. గృహస్థులు బంగారం కొనుగోళ్లకు దిగుతారు. మదుపరులు పెద్దఎత్తున హెడ్జింగ్‌కు దిగుతారు. ఇలాంటి సమయాల్లో విధాన నిర్ణేతలు కంగారుపడుతున్నట్టు కనిపించకుండా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలి’ అని సుబ్బారావు స్పష్లం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌బీఐ ఎంపీసీ రెపో రేటును ప్రస్తుత 5.25 శాతం వద్ద కొనసాగించడమే మేలని ఆయన పరోక్షంగా సూచించారు.
జీడీపీ వృద్ధి రేటు పెంపు కోసం రెపో రేటు తగ్గిస్తే ధరల సెగతో పాటు డాలర్‌తో రూపాయి మారకం రేటు మరింత ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒకవేళ దూకుడుగా వడ్డీ రేట్లు పెంచితే ఆర్థిక కార్యకలాపాలకు బ్రేక్ పడి జీడీపీ వృద్ధి రేటుకి గండి పడే ప్రమాదం ఉందని వారించారు. ఈ నేపథ్యంలో జూన్ 5న వెలువరించే సమీక్షలో ఆర్‌బీఐ రెపో రేటు పెంపునకు వెళ్లక పోవడమే మంచిదని సుబ్బా రావు సూచించారు.
ఇలా చేయడం ద్వారా అటు వృద్ధి రేటునీ, ధరల సెగ, మారకం రేటునీ బ్యాలెన్స్ చేయవచ్చని చెప్పారు. ద్రవ్యోల్బణం కోరలు చాచినా రెపో రేటు పెంచే బదులు ద్రవ్య సరఫరా నిర్వహణ చర్యల ద్వారా దానికి చెక్ పెట్టాలని సూచించారు.

More Stories
సిజెపి ఎక్స్ ఖాతా పునరుద్ధరించేందుకు హైకోర్టు తిరస్కారం
రాహుల్, శివకుమార్ లపై సిద్దరామయ్య బిసి జనగణన పిడుగు!
ప్రధాని కార్యాలయం పర్యవేక్షణలో నీట్ పిజి రీటెస్ట్!