సిద్ధరామయ్య తొలగింపు ఓబిసిలకు ద్రోహం చేయడమే

సిద్ధరామయ్య తొలగింపు ఓబిసిలకు ద్రోహం చేయడమే
ముఖ్యమంత్రి పీఠం నుంచి సిద్ధరామయ్యను తొలగించడం వెనుకబడిన (ఓబీసీ) వర్గాలకు కాంగ్రెస్ చేస్తున్న ద్రోహం అని  బీజేపీ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అభివర్ణించారు. ఇది ఓబీసీల పట్ల కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి ఉన్న నిబద్ధత కేవలం మొసలి కన్నీరు మాత్రమేనని తెలియజేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.  

ముఖ్యమంత్రిని మార్చాలనే నిర్ణయం కాంగ్రెస్ పార్టీపైన, అలాగే కర్ణాటక ఎన్నికల రాజకీయాలపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా మారుతాయని ఆయన హెచ్చరించారు. రాహుల్ గాంధీ దేశమంతటా ఓబీసీల కోసం ప్రచారం చేస్తూ, ఇక్కడ మాత్రం ఒక ఓబీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠం నుంచి తొలగిస్తున్నారని విమర్శించారు. 

దీనితో వెనుకబడిన వర్గాల పట్ల ఆయన కురించే మొసలి కన్నీరు బయటపడిందని స్పష్టం చేశారు.  గత ముూడేళ్ల కాంగ్రెస్ పాలన అంతా కేవలం అంతర్గత కలహాలు, అధికార పోరాటాలతోనే సాగిందని బొమ్మై విమర్శించారు. “సిద్ధరామయ్య దాదాపు ఏడున్నర, ఎనిమిదేళ్లపాటు (గత టెర్మ్తో కలిపి) పనిచేసి ఇప్పుడు రాజీనామా చేస్తున్నారు. మొదటి రోజు నుంచే సిద్ధరామయ్య్, డీకే శివకుమార్ మధ్య పదవీ కాలాన్ని పంచుకునేలా ఒప్పందం కుదిరింది” అని ఆయన తెలిపారు. 

“50 శాతం పదవీ కాలం ముగిశాక తానే ముఖ్యమంత్రి అవుతానని శివకుమార్ మొదటి రోజు నుంచే చెబుతూ వస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ ఆయన సిద్ధరామయ్యను పక్కన పెట్టడానికి ప్రయత్నించారు. దీనితో సిద్ధరామయ్యకు ఒక్క రోజు కూడా ప్రశాంతంగా పాలన చేయడానికి కుదరలేదు” అని బొమ్మై ధ్వజమెత్తారు. 

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం తీవ్ర నష్టాలను చవిచూసిందని, ప్రభుత్వ అప్పులు విపరీతంగా పెరిగిపోయాయని, అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని బొమ్మై ఆరోపించారు. 

“ఆర్థిక నిర్వహణ లోపించడం, ఇద్దరు నేతల మధ్య ఉన్న విభేదాల వల్ల రాష్ట్రంలో పాలన పూర్తిగా శూన్యమైంది. పరిపాలన పూర్తిగా విఫలమైంది. ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదు. ప్రభుత్వ అప్పులు నాలుగు రెట్లు పెరిగాయి. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల వల్ల కర్ణాటక రాష్ట్రం దాదాపు 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.