ఉగ్రవాద కుట్ర కేసులో జబల్‌పూర్ లో ఎన్ఐఏ దాడులు

భోపాల్ ఉగ్ర కేసుపై  నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)  దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే హెచ్ యు టికి చెందిన 17 మందిని నిందితులను భోపాల్ ఎటిఎస్ బృదం అరెస్ట్ చేసింది. హైదరాబాద్ లో ఆరుగురు, భోపాల్ లో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ పోలీసులు ఈ కేసును ఎన్ఐఏకి బదిలీ చేశారు.
 
దేశంలో పేలుళ్ళకు కుట్ర చేసిన హెచ్ యు టి (హిజాబ్ యుట్ తాహ్రిర్) పై కేసు నమోదు చేసిన  ఎన్ఐఏ నిందితులను పలు కోణాల్లో విచారిస్తోంది. నిందితుల విదేశీ లింక్స్, ఆర్థిక మూలలపై దృష్టి పెట్టారు అధికారులు.  ఎన్ఐఏ అధికారులు నిందితుల ల్యాప్ టాప్స్ ఫోన్లలో ఉన్న డేటాను సేకరించే పనిలో పడ్డారు. నిందితులు ఎక్కడెక్కడ శిక్షణ ఇచ్చారు.. ఎక్కడెక్కడ శిబిరాలు నిర్వహించారనే వివరాలు సేకరిస్తున్నారు.
 
తాజాగా, ఉగ్రవాద కుట్ర కేసులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్ ప్రాంతంలో శనివారం నాడు దాడులు చేసింది. జబల్‌పూర్ లోని 13 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు.  భోపాల్ ఉగ్రవాద కుట్ర కేసులో బంగ్లాదేశ్ కు చెందిన జమాత్ ఉల్ ముజాహిదీన్ నిధులు సమకూర్చిందనే సమాచారంతో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేస్తున్నారు. ఉగ్రవాద కుట్ర కేసులో జబల్‌పూర్ ప్రాంతంలోని అనుమానితుల ఇళ్లపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు.
 
ఈ కేసులో ఎన్ఐఏ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ సోదాలు చేసింది. ఈ ఉగ్రవాద కుట్ర కేసులో ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 10మందిని, బంగ్లాదేశ్ కు చెందిన మరో ఆరుగురిని ఇప్పటికే అరెస్టు చేసి, భోపాల్ కోర్టులో ప్రవేశపెట్టింది. బంగ్లాదేశీయులు ఎలాంటి పత్రాలు లేకుండా భారత ఫోర్జరీ డాక్యుమెంట్లతో భారతదేశంలోకి చొరబడ్డారని ఎన్ఐఏ అధికారులు చెప్పారు.
 
ఎన్ఐఏ సోదాల్లో పలు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, బ్యాంకు పాస్ బుక్ లు, గుర్తింపు కార్డులు దొరికాయి. ఈ డాక్యుమెంట్లతో ఉగ్రవాద కార్యకలాపాల కోసం డబ్బు బదిలీ చేశారని తేలింది. జిహాది సాహిత్యం, వీడియోలు, నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జేఎంబీ, అల్ ఖైదా, తాలిబన్ ల ప్రకటనల కాపీలు లభించాయి.