ఢిల్లి యూనివర్సిటీలో ఇక్బాల్‌ పాఠ్యాంశం తొలగింపు!

ఢిల్లీ విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ‘సారే జహా సే అచ్ఛా’ గీత రచయిత మహమ్మద్ అల్లమ ఇక్బాల్‌పై పాఠాన్ని సిలబస్ నుంచి తొలగించాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. బీఏ ఆరో సెమిస్టర్‌లో ‘మోడర్న్ ఇండియన్ పొలిటికల్ థాట్’ అధ్యాయాన్ని తొలగించాలని ఈ విశ్వవిద్యాలయం అకడమిక్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించారు.
 
రాజనీతి శాస్త్రం నుంచి పాకిస్థాన్‌ కవి మహ్మద్‌ ఇక్బాల్‌పై ఉన్న పాఠ్యభాగాన్ని తొలగించేందుకు విశ్వవిద్యాలయం అకడమిక్‌ కౌన్సిల్‌వీసీ యోగేశ్‌ ప్రతిపాదించిన తీర్మానాన్ని  ఏకగ్రీవంగా ఆమోదించినట్లు అధికారులు వెల్లడించారు.   ప్రస్తుతం ఈ అంశం తుదినిర్ణయం కోసం ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ముందు ఉంది.  ఆయన 1877లో అవిభాజ్య భారత్‌లోని సియాల్‌కోటలో జన్మించారు. ప్రత్యేక పాకిస్థాన్‌ ఏర్పాటు ఆలోచనకు మూలం ఇక్బాల్‌ అని చెప్తారు. పాకిస్థాన్ త‌త్వ‌వేత్త‌గా మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్‌కు గుర్తింపు ఉంది.
 
తాజా పరిణామంపై ఢిల్లి వైస్‌ చాన్స్‌లర్‌ యోగేశ్‌ సింగ్‌ స్పందిస్తూ, దేశవిభజనకు పునాది వేసిన వ్యక్తులకు సిలబస్‌లో స్థానం ఉండకూడదని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ ఏర్పాటు గురించి మొదట లేవనెత్తిన వ్యక్తి ఇక్బాల్‌ అని గుర్తు చేశారు.  “వారికి బదులు మన జాతి హీరోల గురించి తెలుసుకుందాం. భారత విభజనకు పునాది వేసిన వ్యక్తులు మన సిలబస్‌లో భాగం కాకూడదు” అని యోగేశ్‌ తెలిపారు.
 
కాగా, డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్, తదితరుల గురించి బోధించాలని వీసీ స్పష్టం చేశారు. దేశ విభజన, హిందుత్వం, గిరిజనులపై అధ్యయనాలకు ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను కూడా ఆమోదించినట్లు తెలిపారు. దేశ విభజనపై అధ్యయనానికి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఐదుగురు కౌన్సిల్ సభ్యులు వ్యతిరేకించినట్లు తెలిపారు. ఇది విభజనవాదమని వారు ఆరోపించారని చెప్పారు.

ఇక్బాల్‌పై పాఠాన్ని సిలబస్ నుంచి తొలగించాలని నిర్ణయించినందుకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) హర్షం ప్రకటించింది. ఫేనటిక్ థియొలాజికల్ స్కాలర్ ఇక్బాల్ దేశ విభజనకు బాధ్యుడని మండిపడింది. పాకిస్థాన్ ఫిలాసఫికల్ ఫాదర్ అని ఇక్బాల్‌ను పిలుస్తారని గుర్తు చేసింది. జిన్నాను ముస్లిం లీగ్‌ నాయకుడిగా స్థిరపరచడంతో ఇక్బాల్ కీలక పాత్ర పోషించారని తెలిపింది.

ఇలా ఉండగా, జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) గత నెలలో సిలబస్‌ను సవరించింది. మొఘలు సామ్రాజ్యానికి, డార్విన్ సిద్ధాంతానికి సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించింది.