కరొన పనితీరులో అగ్రస్థానంలో కేరళ, తమిళనాడు, తెలంగాణ

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న2020-21 సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ రూపొందిన వార్షిక ఆరోగ్య సూచీలో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, తెలంగాణలు పెద్ద రాష్ట్రాల కేటగిరీలో తొలి మూడు స్థానాల్లో నిలిచినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

కాగా చిన్న రాష్ట్రాల్లో త్రిపుర అగ్రస్థానంలో నిలవగా కేంద్రపాలిత ప్రాంతాల(యుటిల) కేటగిరీలో దేశ రాజధాని అయిన ఢిల్లీ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆరోగ్యానికి సంబంధించిన 24 పనితీరు సూచికల ఆధారంగా రూపొందించే ఈ వార్షిక ఆరోగ్య సూచీని నీతి ఆయోగ్ 2017లో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రపంచబ్యాంక్ సహకారంతో నీతి ఆయోగ్ ఈ సూచీలను రూపొందిస్తుంది.

2020-21సంబంధించిన అయిదో వార్షిక ఆరోగ్య సూచీ నివేదికను 2022 డిసెంబర్‌లోనే విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ దాన్ని ఇంకా బహిరంగ పర్చలేదు. అయితే నీతి ఆయోగ్ ఈ నివేదికను ఆరోగ్య మంత్రిత్వ శాఖతో పంచుకొన్నట్లు తెలుస్తోంది.  ఓవరాల్ పనితీరు విషయంలో 19 పెద్ద రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో నిలవగా, బీహార్(19వ స్థానం), ఉత్తరప్రదేశ్ (18వ స్థానం) మధ్యప్రదేశ్(17వ స్థానం)లు జాబితాలో అట్టడుగున నిలిచాయి.

కాగా కిందటి ఏడాదితో పోలిస్తే మెరుగైన పనితీరు విషయంలో రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఒడిశాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. కాగా 8 చిన్న రాష్ట్రాల్లో త్రిపుర ఓవరాల్ పనితీరులో అత్యుత్తమంగా నిలవగా సిక్కిం, గోవాలు తర్వాతి రెండు స్థానాల్లో నిలిచాయి. కాగా అరుణాచల్ ప్రదేశ్(6వ స్థానం), నాగాలాండ్(7వ స్థానం), మణిపూర్ (8వ స్థానం)తో జాబితాలో అట్టడుగున నిలిచాయి.

ఇక కేంద్రపాలిత ప్రాంతాల విషయానికి వస్తే ఓవరాల్ పనితీరు విషయంలో లక్షద్వీప్ అగ్రస్థానంలో నిలవగా ఢిల్లీ అట్టడుగు స్థానంలో నిలిచింది. కాగా 2019-20 సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన నాలుగో ఆరోగ్య సూచీలో పెద్ద రాష్ట్రాలకు సంబంధించి ఓవరాల్ పని తీరులో కేరళ, తమిళనాడులు తొలి రెండు స్థానాల్లో నిలవగా, క్రితం ఏడాదితో పోలిస్తే మెరుగైన నని తీరు విషయంలో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, అసోంలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.