జూన్ 3, 4 తేదీల్లో మెగా జాబ్ మేళా

కేంద్ర ప్రభుత్వ సహకారంతో దక్షిణాది రాష్ట్రాలలో తొలిసారిగా జూన్ 3, 4 తేదీల్లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలో నైపుణ్యం కలిగి యువత అవసరం పెరిగిందని, విదేశాలలో సైతం దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతున్నాయని చెప్పారు.

జూబ్ మేళాకు ఎనిమిదో తరగతి నుంచి పిహెచ్‌డి వరకు అర్హతలు ఉన్న యువత తమ విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని ఆయన సూచించారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారు తమ అనుభవ పత్రాలను తెచ్చుకోవాలని సూచించారు. జాబ్ మేళాను నగర యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే 16 నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. భవిష్యత్‌లో మరిన్ని విస్తరిస్తామని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెబుతూ శ్రీనగర్‌లో అనేక రకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వస్తున్నాయని పేర్కొన్నారు. స్థానిక యువతకు నైపుణ్యం లేనందున వారికి శిక్షణ ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. జూబ్ మేళాకు 220 సంస్థలు రానున్నాయని వెల్లడించారు.

సెక్యూరిటీ ఫోర్స్‌కు బాగా డిమాండ్ ఉన్నది. హోటల్, హాస్పిటాలిటీ సంస్థలు కొత్తగా వస్తున్నాయి. వాటిల్లో పనిచేసేందుకు యువతకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. జూన్ 3, 4 తేదీల్లో జరిగే జాబ్ మేళాకు వచ్చేవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. కంపెనీల ఉద్యోగాల్లో సెలెక్ట్ చేయకపోతే అలాంటి వాళ్లందరికీ కేంద్ర ప్రభుత్వమే నైపుణ్య శిక్షణ ఇచ్చి మళ్లీ ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తుందని వివరించారు.

కెసిఆర్‌ది బాధ్యతరాహిత్యమైన చర్య

కాగా, కేంద్ర ప్రభుత్వం చేపట్టే అనేక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరు కావడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనేందుకు యాక్షన్ ప్లాన్‌కు సంబంధిత సమావేశం ఏర్పాటు చేస్తే రారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఓపెనింగ్‌కు రారు.. వందే భారత్, సికింద్రాబాద్ స్టేషన్ ఫౌండేషన్‌కు రారని విమర్శించారు.
 
ఇక, ప్రముఖుల జయంతులకు వెళ్లే తీరిక ఉండదు.. కానీ మహారాష్ట్రకు వెళ్లేందుకు తీరిక ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి కూడా ఆయన వెళ్లరని తెలుస్తున్నదని చెబుతూ  ఇలాంటి ఘర్షణాత్మక వైఖరి ప్రభుత్వాల మధ్య కొనసాగించడం పోరాడి సాధించుకున్న తెలంగాణకు నష్టం అని స్పష్టం చేశారు.
 
 వాళ్లు ఎన్ని రోజులు అధికారంలో ఉంటే తెలంగాణ అన్ని రోజులు నష్టపోతదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. సచివాలయం ప్రారంభోత్సవంకు గవర్నర్‌ను పిలువని వారు పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంకు  రాష్ట్రపతిని పిలవాలనడం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ రాకపోతే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతోందా? అని ఎద్దేవా చేశారు.