కొత్త పార్లమెంట్ వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ

భారత కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైన వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ భవనానికి సంబంధించిన ఒక అద్భుతమైన వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ చారిత్రక భవనాన్ని మే 28న ప్రధాని మోదీ  ప్రారంభించనున్న విషయం తెలిసిందే. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునాతన హంగులతో కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఈ భవన నిర్మాణం పూర్తయింది.
 
నూతన పార్లమెంట్ భవనం భారతీయ పౌరులందరూ గర్వించేలా ఉంటుందని పేర్కొంటూ #myparliament#mypride హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ఈ భవనంలోని సమావేశ మందిరాలు, లోపల ఏర్పాటు చేసిన ప్రత్యేక చిహ్నాలు, ఆధునాతన హంగులు ఆకట్టుకునేలా ఉన్నాయి.
 
నూతన పార్లమెంటు భవనం వీడియోను ట్వీట్ చేసి, దీనిని ఎవరికివారు తమ సొంత వాయిస్-ఓవర్‌తో తమ ఆలోచనలను పంచుకుంటూ, రీట్వీట్ చేయాలని ప్రధాని కోరారు. దీనిని రీషేర్ చేసేటపుడు #MyParliamentMyPride హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించాలని కోరారు. వీటిలో కొన్నిటిని తాను రీట్వీట్ చేస్తానని తెలిపారు. ఈ వీడియోకు నెటిజన్ల మంచి స్పందన వస్తోంది. రీట్వీట్ చేస్తూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు.
 
మోదీ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘నూతన పార్లమెంటు భవనం ప్రతి భారతీయునికి గర్వకారణం. ఈ సుప్రసిద్ధ భవనాన్ని ఈ వీడియో చూపిస్తుంది. మీకు నాదొక ప్రత్యేక విజ్ఞప్తి – మీ ఆలోచనలను తెలియజేస్తూ, మీ సొంత వాయిస్-ఓవర్‌తో ఈ వీడియోను రీషేర్ చేయండి. నేను వాటిలో కొన్నిటిని రీట్వీట్ చేస్తాను. #MyParliamentMyPride హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించడం మర్చిపోవద్దు’’ అని మోదీ కోరారు.
 
నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉదయం 7:30 గంటలకే మొదలవుతుంది. మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర హవన్, పూజతో ప్రారంభమవుతుంది. ఈ పూజల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారు.

ఈ నూతన పార్లమెంటు భవనాన్ని అత్యాధునిక, సంప్రదాయ భారతీయ వాస్తు కళా నైపుణ్యంతో నిర్మించినట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. సమకాలిక సౌందర్య, కళా వైభవం, భారత దేశ చరిత్ర, సంస్కృతుల మేళవింపు కనిపిస్తోంది. భారత దేశ సుసంపన్న కళా వారసత్వాన్ని గుర్తు చేస్తూ అలంకృత శిల్పాలు, నమూనాలు ఈ భవనం వెలుపల కనిపిస్తున్నాయి.

8.30 గంటల వరకు ఈ పూజలు కొనసాగుతాయి. 8.30 గంటల నుంచి 9 గంటల మధ్యలో సెంగోల్‌‌ని లోక్‌సభలో పొందుపరచనున్నారు. ఉదయం 9:30 గంటలకు శంకరాచార్యులు, పండితులు, పురోహితులు, సాధువులు పాల్గొనే ప్రార్థనా సభ జరుగుతుంది. ఈ ప్రార్థనా సమావేశంలో శివుడు, ఆదిశంకరులను పూజిస్తారు.
 
ఆ తర్వాత రెండో విడత కార్యక్రమం మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ  నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ సందర్భంగా రెండు షార్ట్ ఫిల్మ్స్‌ స్క్రీనింగ్ జరుగుతుంది. అనంతరం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సందేశాన్ని రాజ్యసభ డిప్యుటీ ఛైర్మన్ చదువుతారు.
 
రాజ్యసభలో కూడా సందేశాన్ని వినిపిస్తారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం చివర్లో ప్రధాని నరేంద్ర మోదీ  ఓ నాణెం, స్టాంప్ విడుదల చేస్తారు. ఆ తర్వాత 2:30 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమం ముగుస్తుంది.  టిడిపి, వైసీపీ, బీజేడీ, ఎస్ఏడీ తదితర పార్టీలతో సహా అధికార కూటమి పక్షాలు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ, డీఎంకే, కాంగ్రెస్ సహా దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.