
‘వివేకా హత్యకేసు గురించి సీఎం వైఎస్ జగన్‌కు అవినాష్ రెడ్డే చెప్పారా? అనే విషయంపై దర్యాప్తు చేయాల్సి ఉంది. వివేక హత్య విషయం జగన్‌కు ఉదయం 6:15 గంటలకు ముందే తెలిసినట్టు దర్యాప్తులో తేలింది. వివేకానందరెడ్డి పిఎ ఎంవీ కృష్ణారెడ్డి ఉదయం 6:15 గంటలకు హత్య విషయం బయట పెట్టక ముందే జగన్‌కు తెలుసు’ అంటూ సీబీఐ వెల్లడించింది.
కాగా, ఈ విషయమై మరిన్ని వివరాలు సేకరించేందుకు అవినాష్ రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని సిబిఐ స్పష్టం చేసింది. విచారణకు ఎంపీ సహకరించడం లేదని పేర్కొంటూ హత్య వెనక భారీ కుట్ర చెప్పేందుకు అవినాష్ ముందుకు రావడం లేదని ఆరోపించింది. హత్య జరిగిన రాత్రి 12:27 గంటల నుంచి 1:10 వరకు అవినాష్ వాట్సప్ కాల్స్ మాట్లాడారని తెలిపింది.
అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని పేర్కొంటూ ఇటీవల జరిగిన పరిణామాలను సిబిఐ ప్రస్తావించింది. ఈనెల 15న విచారణకు రావాలని నోటీసులు ఇస్తే నాలుగు రోజులు సమయం కావాలన్నారు. మే-16న మళ్లీ నోటీసు ఇస్తే తల్లి అనారోగ్యం వల్ల రాలేనన్నారు. 19న తల్లి అనారోగ్యం నెపంతో ఉద్దేశపూర్వకంగా హైదరాబాద్ విడిచి వెళ్లారు.
విచారణకు రావాలని అవినాష్‌కు ఫోన్ చేసి కోరినప్పటికీ రాలేదు. ఈనెల 22న రావాలని నోటీసు ఇస్తే తల్లి అనారోగ్యం వల్ల వారం రోజులు రానన్నారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ఈనెల 22న సీబీఐ బృందం కర్నూలు వెళ్ళిందని తెలిపింది. ఆస్పత్రి వద్ద అవినాష్ అనుచరులు భారీగా ఉండడంతో శాంతిభద్రతల సమస్య రావచ్చునని అనిపించిందని పేర్కొంటూ జూన్ 30లోగా దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉన్నందున అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరుతూ హైకోర్టులో అడిషినల్ కౌంటర్ అఫిడవిట్‌ను సీబీఐ దాఖలు చేసింది.
సీబీఐ చేసిన సంచలన ఆరోపణలతో తెలుగు రాష్ట్రాల్లో ఇదిప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నది. అసలు జగన్‌కు ఎవరు చెప్పారు? అవినాషే చెప్పారా? లేకుంటే మరెవరైనా చెప్పారా? ఈ అంశాలను నిర్ధారించుకోవడం కోసమే సిబిఐ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలని పట్టుబడుతున్నట్లు ఇప్పుడు స్పష్టమైంది. అందుకనే అవినాష్ రెడ్డి సిబిఐ విచారణను ఏదో ఒక సాకుతో తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
కాగా, అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. వేసవి సెలవుల ప్రత్యేక బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ సుమారు ఏడు గంటలసేపు విచారణ జరిపారు. అవినాష్ రెడ్డి, వివేకానందరెడ్డి కుమార్తె డా. సునీత తరుపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అప్పటికే కోర్టు సమయం ముగియడంతో శనివారం ఉదయం 10.30 గంటలకు సిబిఐ వాదనలు వింటామంటూ న్యాయమూర్తి తదుపరి విచారణను వాయిదా వేశారు.
More Stories
మార్గదర్శి ఎండి శైలజను ప్రశ్నించిన ఏపీ సిఐడి
క్రికెట్ బుకీని పట్టించిన అమృతా ఫడ్నవీస్
జూన్ 11న సచిన్ పైలట్ సొంత పార్టీ ప్రకటన?