* ఆర్.జి. కార్ బాధితురాలి తల్లి ఆవేదన
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ (టీఎంసీ)ని గద్దె దింపి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారాన్ని కైవసం చేసుకున్న కొద్ది రోజులకే, అత్యాచారం-హత్యకు గురైన ఆర్.జి. కార్ రెసిడెంట్ డాక్టర్ తల్లి రత్న దేబ్‌నాథ్, మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఓటమిని తన కుమార్తె మరణంతో ఆమె పోల్చారు.
“నేను నా కూతురిని కోల్పోయాను. ఆమె పదవిని కోల్పోయారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ, ఆమె ‘బృందం’ ‘మరింత విషాదకరమైన పర్యవసానాన్ని’ ఎదుర్కొంటారని కూడా ఆమె హెచ్చరించారు. “నేను ఈ రోజు ఎమ్మెల్యే అయ్యుండవచ్చు, కానీ నా జీవితంలోని ఆనందమంతా పోయింది. నా ఏకైక లక్ష్యం న్యాయం జరగడమే. నేను ముఖ్యమంత్రికి సమర్పించిన పేర్లను ఇంతకుముందే దర్యాప్తు అధికారులతో కూడా పంచుకున్నాను,” అని ముఖ్యమంత్రి సువెందు అధికారిని సోమవారం కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దేబ్‌నాథ్ తెలిపారు.
పానిహటి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న దేబ్‌నాథ్, ముఖ్యమంత్రి సువేందు అధికారితో సమావేశమైన అనంతరం ఒక ఎక్స్-పోస్ట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. “ఈరోజు నేను నబన్నలోని 14వ అంతస్తులో ముఖ్యమంత్రితో సమావేశంలో ఉన్నాను. ఆయన పేరు సువేందు అధికారి. నిజాయితీ శక్తి అపారమైనది. అన్యాయానికి వ్యతిరేకంగా ఓపికగా పోరాడితే చాలు,” అని ఆమె పేర్కొన్నారు.
దేబ్‌నాథ్ కుమార్తె కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల పోస్ట్-గ్రాడ్యుయేట్ ట్రైనీ రెసిడెంట్ డాక్టర్‌గా పనిచేస్తుండేది. 2024 ఆగస్టు 8, 9 తేదీల మధ్య రాత్రి ఆసుపత్రిలోని సెమినార్ గదిలో ఆమెపై అత్యాచారం చేసి, చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. నిందితులను కాపాడటానికి, ఘటన తీవ్రతను తగ్గించడానికి సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపణలు వచ్చాయి.
ఆ తర్వాత ఈ కేసును కలకత్తా హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేసింది. గత వారం హైకోర్టు, ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (ఎస్‌ఐటి) ఏర్పాటు చేయాలని దర్యాప్తు సంస్థను ఆదేశించింది. ఈ ఘటనలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రమేయం ఉన్న చాలా మంది నిందితులు దర్యాప్తు పరిధిలోకి రాలేదని దేబ్‌నాథ్ ఆరోపించారు.
ఆమె తన భర్తతో కలిసి, గత టీఎంసీ ప్రభుత్వం నిందితులను కాపాడిందని ఆరోపించారు. ఈ విషయాన్ని పోలీసులు నిర్వహించిన తీరును కూడా ఆమె విమర్శించారు. ఇప్పుడు, ఈ కేసు విచారణ సమయంలో కీలక పదవుల్లో ఉన్న ఐపీఎస్ అధికారులు వినీత్ గోయల్, ఇందిరా ముఖర్జీ, అభిషేక్ గుప్తాలను సీఎం అధికారి సస్పెండ్ చేశారు. వారి ముగ్గురిపై శాఖాపరమైన విచారణ జరపాలని కూడా ఆయన ఆదేశించారు.

More Stories
`సనాతన ధర్మం’ ఎలుకల బోనులో చిక్కుకున్న సీఎం విజయ్
నీట్ యూజీ రీ-టెస్ట్‌ను సజావుగా జరిపేందుకు సహకరించండి
యూపీ అసెంబ్లీ, సెక్రటేరియట్ పై ఉగ్ర దాడికి భారీ కుట్ర