తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమీషన్ సన్నాహాలు

తెలంగాణ శాసనసభకు రానున్న ఆరు నెలలలో జరిగే ఎన్నికలకు భారత ఎన్నికల కమీషన్ సన్నాహాలను ప్రారంభించింది. శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో రాష్ట్రంలోని 33 జిల్లా ఎన్నికల అధికారులు, డిప్యూటీ డిఈఓలతో ఈవిఎం వర్క్‌షాప్‌ను నిర్వహించింది.

ఈ వర్క్‌షాప్‌ను త్రిపుర, ఆంధ్రప్రదేశ్, అండమాన్, డామన్ డయ్యూ, దాద్రా & నగర్ హవేలీ తదతర రాష్ట్రాలకు చెందిన ఈసిఐ, ఈవిఎం నోడల్ అధికారులు, ఈసిఐఎల్ ఇంజనీర్ల సమక్షంలో నిర్వహించారు. ఇప్పటికే ఏప్రిల్ 9, 11 తేదీలలో అన్ని రాష్ట్రాల సిఈఓలతో ముస్సోరీలో భారత ఎన్నికల కమీషన్ జాతీయ స్థాయిలో వర్క్‌షాప్ నిర్వహించారు.

ఇందులో తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అవసరమైన సన్నాహాలను ప్రారంభించడానికి ఎన్నికల కమీషన్ సూచనలు జారీ చేసింది. గత నెలలో రాష్ట్రంలో సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ (సీనియర్ డిఇసి) పర్యటించి ఎన్నికల సంసిద్ధతను సమీక్షించారు. తాజాగా ఈవిఎంల ఎఫ్‌ఎల్‌సి యొక్క విభిన్న సాంకేతికలను, వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.

సాంకేతిక, పరిపాలనా భద్రతలు, ఎఫ్‌ఎల్‌సి ప్రక్రియపై ఎన్నికల కమీషన్ అధికారులు జిల్లాల ఎన్నికల అధికారులకు, డిప్యూటి డిఈఓల బాధ్యతలు, ఎఫ్‌ఎల్‌సి, కొత్త సింబల్ లోడింగ్ యూనిట్ (ఎస్‌ఎల్‌యు) విధానంపై శిక్షణ ఇచ్చారు. ఈసిఐఎల్‌కు చెందిన 16 మంది ఇంజనీర్ల సమక్షంలో ఈవిఎం/ వివి ప్యాట్ పై శిక్షణ ఇచ్చారు.

శాసనసభ ఎన్నికల నిర్వహణకు వివిధ అంశాలకు సంబంధిత 18 మంది నోడల్ అధికారులను నియమించాలని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్, ఈటిపిబిఎస్, ఇంటి నుంచి ఓటు వేయాల్సిన అవసరాన్ని అంచనా వేయాలని డిఈఓలకు సూచించారు.

జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక, వ్యయం, సున్నిత నియోజకవర్గాల గుర్తింపు, ఇతర అంశాలు, క్లిష్టమైన పోలింగ్ స్టేషన్ల గుర్తింపుపై ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. రెండో ప్రత్యేక ఎస్‌ఎస్‌ఆర్‌ను అక్టోబర్ ఒకటిని క్వాలిఫైయింగ్ తేదీగా ప్రకటించారని వెల్లడించారు.  షెడ్యూల్ ప్రకారం ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ రోల్ అగస్టు 2వ తేదీన ప్రచురిస్తారని, తుది ఓటరు జాబితాను అక్టోబర్ 4వ విడుదల చేస్తారని తెలిపారు. బిఎల్‌ఓల ద్వారా ఇంటింటికి ధృవీకరణ, ఇతర ప్రీ రివిజన్ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని ఆయన డిఇఓలను ఆయన ఆదేశించారు.