కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసుకు సంబంధించి తమ సంస్థకు చెందిన నాయకులపై దుష్ప్రచారం చేస్తుండటం పట్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ విధంగా దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తెలంగాణ ప్రాంత సంఘచాలక్ బర్ల సుందర్ రెడ్డి ఓ ప్రకటనలో హెచ్చరించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సంబంధించిన వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ కార్యకక్తలను, సంఘాన్ని అనవసరంగా వివాదాల్లోకి లాగుతూ కొన్ని మీడియా సంస్థలు అపఖ్యాతిపాలు కావించే ప్రయత్నం చేస్తున్నాయని అంటూ ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ప్రాంత కార్యవాహ కాచం రమేశ్, ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ పేర్లను ప్రస్తావించడం, వారికి బండి సంజయ్ తో ఆర్థిక లావాదేవీలు వున్నాయని, అందుకే వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాంటూ అసత్య ఆరోపణలు, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు అల్లి, కొన్ని మీడియా సంస్థలు వాస్తవ విరుద్ధమైన అంశాలను ప్రచారం చేయడాన్ని సుందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
బీజేపీ అంతర్గత, సంస్థాగత వ్యవహారాలకు సంబంధించినంత వరకు, ఇక్కడి బీజేపీ వ్యవహారాలను నేరుగా బీజేపీ కేంద్ర నాయకత్వమే పర్యవేక్షిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే సమన్వయం కూడా ఆ పార్టీ అధిష్ఠానమే చేస్తుందని పేర్కొంటూ ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ తెలంగాణ శాఖకి ఎలాంటి సంబంధం లేదని, ప్రత్యక్ష జోక్యం కూడా వుండదని ఆయన తేల్చి చెప్పారు.
సమాజంలో నిరంతరం నిస్వార్థంగా, ప్రజా సేవలో నిమగ్నమయ్యే లబ్ధ ప్రతిష్ఠ కలిగిన కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని, వారి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఈ దుష్ప్రచారానికి ఒడిగట్టారని సుందర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా విచక్షణా రహితంగా కొన్ని మీడియా సంస్థలు బండి సంజయ్ కి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఆర్థిక వ్యవహారాలు వున్నాయని, అందుకే ఆయన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ నిరాధారమైన తప్పుడు కథనాలను ఇస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిరాధారమైన వార్తలతో సంఘ్ ని, కార్యకర్తలను అపఖ్యాతి చేయాలని చూస్తే వారిపై కఠినమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
మీడియా ద్వారా సమాజానికి వాస్తవ విషయాలను అందించాల్సింది పోయి, తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారని చెబుతూ ఇకనైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలను నిలిపివేయాలని, లేని పక్షంలో ఆ వ్యక్తులపై చట్ట ప్రకారం, న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వుంటుందని తేల్చి చెప్పారు.

More Stories
తెలుగు రాష్ట్రాల జలవివాదాలు పరిష్కారంకు కేంద్రం ఫార్ములా!
వరంగల్ జంట హత్యల కేసులో మరణ శిక్ష
హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం 50 శాతం, మూసీకి రూ. 3,975 కోట్లు