సంఘ్‌లో ఏమి నేర్పినా అవన్నీ దేశం కోసమే

సంఘ్‌లో ఏమి నేర్పినా అవన్నీ దేశం కోసమే
సంఘ్‌లో ఏమి నేర్పినా అవన్నీ దేశం కోసమే తప్ప వ్యక్తిగతం కాదని  లోహియా గ్రూప్ అధినేత కన్హయ్య లాల్ లోహియా స్పష్టం చేశారు.  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)  తెలంగాణ ప్రాంత సంఘ శిక్షావర్గ (సామాన్య) – సార్వజనికోత్సవంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ  ఈ శిక్షావర్గలో శిక్షణ పొందినవారంతా భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా నిలుస్తారని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. 
 
రాష్ట్ర చేతనకు నడుంబిగించిన స్వయంసేవకుల ముఖాలలో ఆ చైతన్యాన్ని తాను చూస్తున్నానని ప్రశంసించారు. స్వాతంత్రోద్యమ కాలంలోను, దేశవిభజన సమయంలోను జాతికి స్వయంసేవకులు అండగా నిలిచారని కొనియాడారు. విపత్తుల వేళ ప్రజలకు తోడై నిలిచి ఆకలి తీర్చడంతో పాటు ఔషధాలు అందించి, అంతిమ సంస్కారాలు సైతం చేసిన సందర్భాలను తాను కళ్ళారా చూశానని పేర్కొంటూ  కేవలం దేశభక్తి గలవారు మాత్రమే ఇలా చెయ్యగలరని ఆయన చెప్పారు. 
పేదరిక నిర్మూలన, విద్యా వికాసం, గోసేవలకు వ్యాపార రంగం ఉపయోగపడాలని తాను నమ్ముతానని చెబుతూ నర సేవే నారాయణ సేవ అని, ఆర్ఎస్ఎస్ ఇదే చేస్తున్నదని తన మనోగతాన్ని వెల్లడించారు
 
ముఖ్యవక్తగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహకార్యవాహ ఎర్ర నర్సింగ్ మాయ మాటలు చెప్పి మతం మార్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పంచపరివర్తన ద్వారా హిందూ సమాజంలో తామంతా ఒక్కటేనన్న భావనను కలిగిస్తూ దేశాన్ని సంఘ్ ముందుకు నడిపిస్తున్నదని తెలిపారు. మన దేశాన్ని వ్యాపారం ద్వారా నియంత్రించాలని భావించే గ్లోబల్ మార్కెట్ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, స్వదేశీకి మాత్రమే ప్రాధాన్యతనివ్వాలని నర్సింగ్ పిలుపునిచ్చారు.
సంఘ్‌లోని నిత్యశాఖ శక్తికేంద్రంగా, వ్యక్తి నిర్మాణ వ్యవస్థగా, సంస్కార నిలయంగా యువతను తీర్చిదిద్దుతున్నదని తెలిపారు. త్రేతాయుగంలో యజ్ఞస్థలం శక్తికేంద్రంగా ఉండేదని, నేడు సంఘ స్థాన్ అటువంటి సామాజిక శక్తికేంద్రంగా ఉందని ఆయన చెప్పారు. 
 
క్షేత్ర సంచాలక్ డాక్టర్ వామన్, తెలంగాణ ప్రాంత సంఘచాలక్ బర్ల సుందర్ రెడ్డి, వర్గ సర్వాధికారి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. మే 7వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ జరిగిన సంఘ శిక్షావర్గ (సామాన్య)లో మొత్తం 260 మంది శిక్షార్థులు పాల్గొన్నారని, 15వ తేదీన 94 కుటుంబాలతో మాతృహస్త భోజన కార్యక్రమం విశేషంగా జరిగిందని నిర్వాహకులు తెలిపారు. 
 
జిల్లా, విభాగ్, ప్రాంత, క్షేత్ర, అఖిలభారత స్థాయి అధికారులు శిక్షార్థులకు శిక్షణనిచ్చినట్లు వివరించారు. సార్వజనికోత్సవంలో భాగంగా రక్షణ, నియంత్రణ, సమాజహితం లక్ష్యంగా నేర్చి స్వయంసేవకులు ప్రదర్శించిన పథసంచలన్, పద విన్యాస్, దండ వ్యాయామ్, నియుద్ధ, ద్వంద్వ యుద్ధం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఘోష్ వాద్య ప్రదర్శన, శాఖలోని ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.