గత నాలుగు సంవత్సరాలుగా దాదాపు 60 లక్షల మంది విద్యార్థులకు అందాల్సిన సుమారు రూ. 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బిజెపి ఎమ్యెల్సీ డా. సిహెచ్ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. కోర్టు సాక్షిగా ఈ నెల 15 లోపు చెల్లిస్తామని ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని, బకాయిలు రాక విద్యార్థులు సర్టిఫికేట్లు లేక, ఉద్యోగాలు వచ్చినా చేరలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
మేనిఫెస్టోలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నాటి పథకాన్ని మెరుగ్గా అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు ప్రతి నెలా రూ. 200 కోట్లు ఇస్తామన్న హామీని కూడా గాలికి వదిలేశారని విమర్శించారు. అదేవిధంగా నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి మండిపడ్డారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ పేరుతో కాలయాపన చేస్తూ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తు రుసుమును రూ. 200 నుండి రూ. 1000కి పెంచి నిరుద్యోగులపై అదనపు భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ. 1000 కోట్లు, నియోజకవర్గానికి ఒక తెలంగాణ స్టడీ సర్కిల్, ‘రాజీవ్ యువ వికాసం’ వంటి హామీలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోయాయని, విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు కనీసం పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు కూడా ఇవ్వలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులను తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేస్తోందని, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని అంజిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలను, ‘హైడ్రా’ పేరుతో నిరుపేదలపై జరుగుతున్న అరాచకాలను తీవ్రంగా నిరసించారు.
మరొకవైపు ‘హైడ్రా’ పేరుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న కూల్చివేతల తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాలకు బిజెపి వ్యతిరేకమని, అయితే అనుమతులు ఇచ్చిన ఎంఆర్ఓలు, టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం పేదల ఇళ్లను కూల్చడం సరైంది కాదని స్పష్టం చేశారు.
చెరువుల శిఖం భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే వారికి ప్రత్యామ్నాయ భూమి లేదా పరిహారం ఇవ్వాలని, లేదా ప్రజలు భయం లేకుండా ఇళ్లు కట్టుకోవడానికి ‘హైడ్రా’ ముందే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసి) ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించారు.

More Stories
హైడ్రాపై హైకోర్టు ఆదేశంపై సీఎం రేవంత్ రెడ్డి ధిక్కార ధోరణి
పోలీసుల అదుపులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ అమ్మాయి మృతి