యాదగిరిగుట్టలో రూ.100 కోట్లతో పనులకు సీఎం శంకుస్థాపన

యాదగిరిగుట్టలో రూ.100 కోట్లతో పనులకు సీఎం శంకుస్థాపన
తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ 100 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు తాజాగా శంకుస్థాపనలు చేశారు.  రూ.43.79 కోట్లతో క్షేత్రంలోని పెద్దగుట్ట ఆలయనగరి లేఅవుట్ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నటువంటి సంప్రదాయ వేదపాఠశాల భవనానికి కంచి కామకోటి పీఠాధిపది శ్రీశంకర విజయేంద్ర సర్వస్వతి స్వామి సమక్షంలో శంకుస్థాపన చేశారు.

వచ్చే రెండేళ్లలో వేదపాఠశాల నిర్మాణం పూర్తిచేసి తరగతులు ప్రారంభించనున్నారు. ఇందులో 300 మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసించే విధంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. వేద పాఠశాలలో విద్యార్థులకు ఉచిత బోధనతో పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నారు. అత్యాధునికి గోశాలతో పాటు యజ్ఞశాల, యాగశాలలు సైతం నిర్మించనున్నారు.ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న వేదపాఠశాలలో కంచి కామకోటి పీఠం పర్యవేక్షణలో బోధన చేపట్టనున్నారు. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదంతోపాటు ఆగమ శాస్త్రాన్ని అధ్యయనం చేసేందుకు వీలు కల్పించి విద్యార్థులకు పట్టాలు అందించనున్నారు. 

రూ.9.88 కోట్లతో యాదగిరిగుట్టపై నిత్య కల్యాణం రంగం మండపాల నిర్మాణం చేయనున్నారు. అదే సమయంలో రూ.1.41 కోట్లతో గుట్ట కింది నుంచి కొండ పైకి ఉన్న మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించనున్నారు. ఇక మాఢవీధులకు మెట్లు నిర్మించేందుకు రూ.1.44 కోట్లను కేటాయించారు.  వీటితోపాటు రథశాల వైపు వాయవ్య దిశలో ఉన్న మాడవీధులకు అనుసంధానంగా రూ. 1.35 కోట్ల అంచనా వ్యయంతో కొత్త మెట్ల నిర్మాణ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. 
 
మరో రూ.43.5 కోట్లతో దీక్షాపరుల మండపం, డార్మిటరీ హాల్స్ పనులకు కూడా సీఎం రేవంత్‌ రెడ్డి తాజాగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. యాదగిరిగుట్ట టెంపుల్ సిటీని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో ఉన్నతంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా ఈ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు అధికారులు తెలిపారు.