కృత్రిమ మేధను విస్తృతంగా ఉపయోగించనున్న తెలంగాణ పోలీస్ 

కృత్రిమ మేధను విస్తృతంగా ఉపయోగించనున్న తెలంగాణ పోలీస్ 
 
రాష్ట్రంలో నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీసింగ్‌ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)ను విసృ్తతంగా ఉపయోగించాలని నిర్ణయించినట్టు డీజీపీ సీవీ ఆనంద్‌ చెప్పారు. ఈ మేరకు ప్రత్యేకంగా టెక్‌ టీమ్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.   తెలంగాణ పోలీసు అధికారిక వెబ్‌సైట్‌, హాక్‌ఐ, సీసీటీఎన్‌ఎస్‌, హెచ్‌ఆర్‌ఎంఎస్‌ వంటి అన్ని ప్రధాన సాంకేతిక ప్లాట్‌ఫా మ్‌లను డీజీపీ కార్యాలయ పరిధిలోకి తీసుకువచ్చి, ఒకే ఉమ్మడి వ్యవస్థ కింద పనిచేయాల్సిన అవసరం ఉన్నదని వెల్లడించారు.
శాశ్వత ప్రాతిపదికన ఈ టెక్‌ టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.  సాంకేతికతపై ఆసక్తి ఉండి, ముందుకు వచ్చే యువ పోలీసు సిబ్బందిని ఈ బృందంలో చేర్చుకుంటామని, దీనివల్ల వారు సరికొత్త ఏఐ వ్యవస్థలను నేర్చుకోవడంతో పాటు వాటి అభివృద్ధిలో చురుగ్గా భాగస్వాములు కాగలరని సీవీ ఆనంద్‌ వివరించారు. ప్రస్తుతమున్న సీసీటీఎన్‌ఎస్‌, హెచ్‌ఆర్‌ఎంఎస్‌ వంటి వ్యవస్థలను అనుసంధానిస్తూ ‘టీఎస్‌-కాప్స్‌’ పేరిట ఒకే ఉమ్మడి మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాలని, దీని ద్వారా సిబ్బంది ఒకే మొబైల్‌ ఇంటర్‌ఫేస్‌ ద్వారా వివిధ అప్లికేషన్లను యాక్సెస్‌ చేసే వీలుంటుందని డీజీపీ తెలిపారు. 
 
ఏఐ ఆధారిత ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి వీలుగా ఐదుగురు ఐపీఎస్‌ అధికారులతో కోర్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో ఐపీఎస్‌ అధికారికి ఒక్కో బాధ్యత అప్పగించారు. హైదరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌ శ్వేతకు సీసీటీఎన్‌ఎస్-2.0 అభివృద్ధి, హెచ్‌ఆర్‌ఎంఎస్ పర్యవేక్షణతో పాటు సీఐడీ విభాగంతో సమన్వయం చేసుకునే బాధ్యత అప్పగించారు.
సీసీటీఎన్‌ఎస్ ప్రాజెక్టులో ఏఐ సాంకేతికను అనుసంధానించే బాధ్యతను డీఐజీ భాస్కరన్‌కు, సోషల్‌ మీడియా, వీడియో అనలిటిక్స్‌, ఏఐ ఆధారిత డ్రోన్‌ టెక్నాలజీ పర్యవేక్షణ బాధ్యతను డీసీపీ రూపేష్ కు, రహదారి భద్రత మాడ్యుళ్లను అవినాష్‌ మహంతికి, డాటా ఇంటెలిజెన్స్‌, సిస్టమ్‌ డిజైనింగ్‌, శిక్షణ కార్యక్రమాల బాధ్యతను ఎస్పీ అపూర్వారావుకు అప్పగించారు.
 
ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లైన సీసీటీఎన్‌ఎస్‌ 2.0ను సమర్థవంతంగా అమలు చేసేందుకు, డాటా ఆధారిత డ్యాష్‌ బోర్డుల రూపకల్పనకు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటు ఫైళ్ల కదలికలను నిరంతరాయంగా పర్యవేక్షించేందుకు వీలుగా డీజీపీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ పరిధిలోని అన్ని కార్యాలయాలను ఈ-ఆఫీస్‌ సిస్టమ్‌తో అనుసంధానించాలని పేర్కొన్నారు. 
 
సాంకేతిక కార్యక్రమాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక ఫలితాలను ఇచ్చేలా ఉండాలని సూచించారు. ఏఐ ఆధారిత ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు వీలుగా ఐదుగురు ఐపీఎస్‌ అధికారులతో ఒక ప్రత్యేక కోర్‌ టీమ్‌ను డీజీపీ ఆనంద్‌ ఏర్పాటు చేశారు.