తమిళనాడులో పాల లొల్లి.. అముల్ వ‌ర్సెస్ అవిన్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్కడ గుజరాత్ కు చెందిన సహకార పాల సంస్థ అమూల్ పాల విక్రయాన్ని రాజకీయ వివాదంగా మార్చి ప్రతిపక్షాలు దుమారం రేపినట్లుగా, ఇప్పుడు  తమిళనాడులో పాలసేకరణ అంశం రచ్చకెక్కింది. తమిళనాడులో అమూల్ వర్సెస్ ఆవిన్ అన్న చందంగా మారింది.
 
తమిళనాడు రాష్ట్ర సహకార సంస్థ అయిన ఆవిన్ పాల సమాఖ్య నుంచి అమూల్ సంస్థ పాలను సేకరించకుండా ఆపాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు  తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్  లేఖ రాయడం రాజకీయ దుమారం రేపుతోంది. ఆవిన్‌కు పాలు స‌ర‌ఫ‌రా చేసే కేంద్రాల నుంచి అమూల్ సంస్థ పాల‌ను సేక‌రించడం నిలిపివేయాల‌ని ఆ లేఖలో కోరారు.
 
అమిత్ షాకు రాసిన లేఖను స్టాలిన్ తన ట్విట్టర్‌లో ఉంచారు. అమూల్ సంస్థ సహకార స్ఫూర్తికి, ఆపరేషన్ వైట్ ఫ్లడ్ విఘాతం కలిగించేలా వ్యవహరిస్తోందని స్టాలిన్ ఆరోపించారు.  దేశంలో సహకార రంగంలో పాల్ ఉత్పత్తికి అంకురార్పణ చేసిన సంస్థ అమూల్. దేశంలో పాల కొరత తీవ్రంగా ఉండడంతో అమెరికా నుండి పాలపిండిని దిగుమతి చేసుకొంటున్న సమయంలో దేశం పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగేందుకు ఈ సంస్థ దోహదపడింది.
 
నేడు దాదాపు అన్ని రాష్ట్రాలలో సహకార రంగంలో, కార్పొరేట్ రంగంలో కూడా పాల సేకరణ, ఉత్పత్తి పెద్ద ఎత్తున జరుగుతూ ఉండడంతో కరువు, కాటకాలతో చిక్కుకున్న రైతుల జీవనోపాధికి ఆసరాగా నిలుస్తున్నాయి. పాల సేకరణ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో రైతుల ఆత్మహత్యలు లేకపోవడం గమనించవచ్చు. సహకార రంగంలో సేకరించిన పాలను పలు ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు దేశ వ్యాప్తంగా సరఫరా చేస్తున్నాయి.
 
అయితే, ఇప్పుడు సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం చిచ్చు పెడుతున్నట్లు స్పష్టం అవుతుంది. అముల్‌ సంస్థకు చెందిన కైరా జిల్లా స‌హ‌కార పాల ఉత్పత్తుల సంఘం కృష్ణగిరి జిల్లాలో ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా కృష్ణగిరి, ధ‌ర్మపురి, వెల్లోర్‌, రాణిపేట‌, తిరుప‌త్తూర్‌, కంచీపురం, తిరువ‌ల్లూరు జిల్లాల్లో పాల ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు స్టాలిన్ తెలిపారు. పాల ఉత్పత్తిదారులు, స్వయం సహాయక గ్రూపుల నుంచి పాల‌ను సేకరించేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.

మన దేశంలో పాల సేకరణలో ఉన్న విధివిధానాలను అమూల్ పాటించాలని స్టాలిన్ కోరారు. ఒక‌ స‌హ‌కారం సంఘంపై మ‌రో స‌హ‌కార సంఘం ఆధార‌ప‌డ‌కూడదని.. ఆ విధానాన్ని పాటించాల‌ని అముల్ సంస్థకు విజ్ఞప్తి చేశారు. ఇలా పాల సేకరణ చేయడం ఆప‌రేష‌న్ వైట్ ఫ్లడ్ స్ఫూర్తికి విఘాతం క‌లిగించిన‌ట్లు అవుతుంద‌ని తెలిపారు.

 
అవిన్ డెయిరీ సంస్థకు పాల‌ను స‌ర‌ఫ‌రా చేసేవారిపై అముల్ ఆధార‌ప‌డ‌డం స‌హ‌కార స్ఫూర్తిని దెబ్బతీస్తుంద‌ని లేఖలో వివరించారు. అముల్ సంస్థ అనుస‌రిస్తున్న విధానాల వ‌ల్ల పాలు సేక‌రిస్తున్న స‌హ‌కార సంఘాల్ పోటీత‌త్వం అనారోగ్యక‌రంగా మారుతుంద‌ని పేర్కొన్నారు. త‌క్షణ‌మే అముల్ సంస్థ పాల సేక‌ర‌ణ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని సీఎం స్టాలిన్ త‌న లేఖ‌లో అమిత్ షాను కోరారు.

కాగా, ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు అక్కడ అమూల్‌ సంస్థ ప్రవేశంపై ఆ రాష్ట్రంలోని అధికార విపక్షాల మధ్య వివాదాన్ని రాజేసింది. గుజరాత్‌కు చెందిన అమూల్‌ పాలు, పెరుగు ఇక్కడకు రాకుండా అడ్డుకుని తీరుతామని కాంగ్రెస్‌, జేడీఎస్‌ ప్రకటించగా, రాజకీయ లబ్ధి కోసమే ఆ పార్టీలు ఈ అంశాన్ని వివాదం చేస్తున్నాయని బీజేపీ తిప్పికొట్టింది.