భారీగా మార్కెట్ లోకి వస్తున్న రూ 2,000 నోట్లు

దేశవ్యాప్తంగా ఈనెల 19 నుండి రూ.2 వేల నోట్ల ఉపసంహరణ ప్రకటన విడుదలైన తరువాత ఈనోట్లు మార్కెట్‌లోకి పెద్ద ఎత్తున వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రకటన 2016లో జరిగిన సమయంలో రూ. 500, రూ. 2 వేల నోట్లను ఆర్‌బీఐ మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. అయితే, అనూహ్యంగా రూ. 2 వేల నోట్లలో 90 శాతం మేర కనిపించకుండా పోయాయి.

ఇవన్నీ బడా బాబుల గల్లా పెట్టెల్లోకి వెళ్లాయని భావించిన ఆర్‌బీఐ 2018 నుండి ఈనోట్ల ముద్రణ ఆపేసింది. తాజగా సెప్టెంబరు 30 వరకూ ఈ నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించడంతో కనిపించకుండా పోయిన నోట్లన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కరెన్సీ నోట్లు దాచుకున్న ప్రజలు, బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు కొత్త దారులు అన్వేషిస్తున్నారు.

2016 నుండి కేవలం 10 శాతం మేర మాత్రమే చలామణిలో ఉన్న నోట్లు కేవలం వారం రోజుల వ్యవధిలోనే మరో 10 శాతం మేర చలామణిలోకి వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.  బ్యాంకుల్లో రోజుకు రూ. 20 వేల వరకూ ఈ నోట్లను జమ చేసుకునే విధంగా ఆర్‌బీఐ వెసులుబాటు కల్పించినప్పటికీఈ నోట్ల జమ మందకొడిగా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

మార్కెట్‌లోకి వస్తున్న నోట్లన్నీ బంగారం దుకాణాలు, పెట్రోల్‌ బంక్‌ల నుండే అధికంగా వస్తున్నాయి.  మార్కెట్‌లోకి వస్తున్న ఈనోట్లన్నింటినీ ఆర్‌బీఐ సేకరించి భధ్రపరస్తోంది.  వాణిజ్య సముదాయాలు, పెట్రోల్‌ బంక్‌లు, బంగారు దుకాణాల్లో మరీ ముఖ్యంగా ఈ నోట్ల చలామణి జరుగుతోంది. ఎక్కువ మంది షాపింగ్‌ చేయడానికి రూ.2 వేల నోటును వినియోగిస్తూ ఉండడంతో దేశంలోని చాలా దుకాణాలు రూ.2,000 నోట్లను తమ అమ్మకాలను పెంచుకోవడానికి ఒక అవకాశంగా భావిస్తున్నాయి. ఈ నోట్లను ఆసక్తిగా స్వీకరిస్తున్నాయి. వినియోగదారులు అధిక విలువ కలిగిన కరెన్సీని ఉపయోగించి చెల్లింపులు చేయడంతో కొన్ని బ్రాండెడ్ దుకాణాల అమ్మకాలు పెరిగాయి. 

 ఈ నోట్ల మార్పిడికి దాదాపుగా 131 రోజుల వ్యవధి ఉంది. ఇప్పటికే ఇందులో వారం రోజులకే కేవలం మరో 10 శాతం మార్కెట్‌లోకి వస్తే ఇంకా ఉన్న 125 రోజుల్లో పూర్తిగా రూ. 2 వేల నోట్లు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దానితో, ఈ నోట్ల మార్పిడికి ఆర్‌బీఐ ఇచ్చిన గడువుకంటే ముందే కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ మొత్తం రూ. 2 వేల నోట్లు ఆర్‌బీఐకి చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

ఆర్‌బీఐ పర్యవేక్షణలో కూడా బ్యాంకులకు వచ్చి డిపాజిట్లు చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు.  బయటి మార్కెట్ల నుండే అత్యధిక మోతాదులో ఈ నోట్లు బ్యాంకులకు వచ్చి చేరుతున్నాయని చెబుతున్నారు. అందుకు బ్యాంకు నిబంధనలు కూడా కారణమని చర్చ జరుగుతుంది. ఇక పెద్ద మొత్తంలో ఈ నోట్లు జమ చేయాలంటే ఐటీ శాఖ కన్ను కూడా వారిపై ఉంటుందని, ఈనేపథ్యంలో బహిరంగ మార్కెట్‌లో కొనుగోళ్ల ద్వారా ఈ డబ్బును సొమ్ము చేసుకుంటే మంచిదన్న భావనతోనే ఈ నోట్లు దాచిన వారు భావిస్తున్నట్లు ఆర్ధిక నిపుణులు పేర్కొంటున్నారు.