రూ.2000 నోట్ల మార్పిడి ప్రక్రియపై ఆర్బీఐ పర్యవేక్షణ

రూ.2000 నోట్ల మార్పిడి ప్రక్రియ నిరంతరాయంగా పూర్తవుతుందని, ఈ పక్రియను ఆర్బీఐ నిరంతరం పర్యవేక్షిస్తోందని భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. కరెన్సీ నిర్వహణలో భాగంగా ఈ నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది.

శక్తికాంత దాస్ బుధవారం కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొంటూ, రూ.2000 నోట్లను మార్చుకోవడానికి లేదా బ్యాంకుల్లో జమ చేసుకోవడానికి ఆర్బీఐ నాలుగు నెలల గడువు ఇచ్చిందని చెప్పారు. దీని కోసం ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

మంగళవారం ఎక్కడా రద్దీ కనిపించలేదని అంటూ ఏదైనా విపరీతమైన సమస్య కానీ, ఆందోళన కానీ ఎదురవుతుందని తాను భావించడం లేదని స్పష్టం చేశారు. వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. సెప్టెంబరు 30 వరకు గడువు ఇవ్వడం సరైనదేనని సమర్థించుకున్నారు. గడువు లేకపోతే సత్ఫలితాలు రావన్నారు.

మన దేశంలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 10.8 శాతం రూ.2000 నోట్లు ఉన్నాయి. అంటే వీటి విలువ రూ.3.6 లక్షల కోట్లు. వీటి జీవిత కాలం పూర్తయిందని, వీటిని ముద్రించడం వెనుక ఉన్న లక్ష్యం నెరవేరిందని తెలిపారు. ఈ నోట్లను లావాదేవీల్లో ఉపయోగించడం లేదన్నారు.

అక్కడక్కడ హై డినామినేషన్ నోట్లు ఉన్నా, దానికి ఇతర సమస్యలు కూడా ఉన్నాయని చెప్పారు. 2016 నవంబరులో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో చలామణిలో ఉన్న నోట్లలో ఇవి 86 శాతం ఉండేవి. అప్పుడే రూ.2,000 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చారు. వీటిని చలామణిలోకి తీసుకురావడానికి ముందే వీటి గతి నిర్ణయమైపోయింది.

వీటి ముద్రణను చాలా కాలం క్రితమే నిలిపేశారు. ఈ నోట్లను ముద్రించరాదని 2017 జూలై-ఆగస్టు నెలల్లో సూత్రప్రాయంగా నిర్ణయించారు. అప్పటి వరకు రూ.7 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉండేవి. 2018-19లో ఈ నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపేసినట్లు ఈ నెల 19న ఆర్బీఐ విడుదల చేసిన పత్రికా ప్రకటన పేర్కొంది.

కాగా, తొందరలేదని, నోట్ల మార్పుడి కోసం హడావుడిగా బ్యాంకులకు పరిగెత్తవద్దని హెచ్చరిస్తున్నా పెద్ద ఎత్తున జనాలు బ్యాంకులకు వస్తుండటంతో నగదు లేక నోట్ల మార్పిడి ప్రక్రియను బుధవారం కొన్ని బ్యాంకులలో తాత్కాలికంగా ఆపేశారు బ్యాంకర్లు. మంగళవారం నుంచే రూ.2000 నోట్ల మార్పిడి మొదలవగా, రూ.500, రూ.200, రూ.100 నోట్లు సరిపడా బ్యాంకు శాఖల్లో ఉండటం లేదని చెప్తున్నారు. దీంతో చేసేదేమీ లేక కొందరు బ్యాంకర్లు చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.