టాప్ 20 ప్రపంచ సంపన్నుల జాబితాలోకి తిరిగి గౌతమ్ ఆదానీ

ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ  మళ్లీ ప్రపంచ సంపన్నుల జాబితాలో చేరారు. ఆదానీ గ్రూప్ కంపెనీల షేర్లు గత వారం రోజులుగా పై పైకి దూసుకుపోతున్న నేపథ్యంలో ఆయన ప్రపంచ సంపన్నుల్లో 18వ స్థానానికి వెళ్లారు.  ఒకప్పుడు ప్రపంచ సంపన్నుల్లో రెండో స్థానంలో నిలిచి, ఒక వెలుగు వెలిగిన భారతీయ ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీ హిండెన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఆ సంపన్నుల జాబితా నుంచి కిందకు దిగజారారు.

ఇప్పుడు ఆదానీ షేర్ల దూకుడుతో మళ్లీ టాప్ 20 సంపన్నుల్లో ఒకరయ్యారు. సెప్టెంబర్ 2022 లో 154 బిలియన్ డాలర్ల సంపదతో ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ ప్రపంచ సంపన్నుల్లో రెండో స్థానంలో నిలిచారు. కానీ, ఈ సంవత్సరం ప్రారంభంలో ఆదానీ గ్రూప్ కంపెనీలు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాయని, అక్రమంగా షేర్ల విలువను పెంచారని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ ఒక నివేదికను విడుదల చేశారు.

ఆ నివేదిక భారతీయ వ్యాపార, రాజకీయ రంగాల్లో ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఆదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలడం ప్రారంభమైంది. రెండు, మూడు రోజుల్లోనే సుమారు 56.4 బిలియన్ డాలర్ల సంపదను ఆయన కోల్పోయారు. కోట్లాది రూపాయల మదుపర్ల సంపద కూడా ఆవిరైంది. దాంతో ఈ ఫిబ్రవరి నెలలో టాప్ 20 సంపన్నుల జాబితాలో స్థానాన్ని ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ కోల్పోయారు.

ఆ తర్వాత, తక్కువ కాలంలోనే ఆదానీ మళ్లీ పుంజుకున్నారు. ఆదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువ పెరగడం ప్రారంభమైంది. తాజాగా, ఆదానీ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లుగా ఏ విధమైన ఆధారాలు లేవని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. మరోవైపు, ఆదానీ గ్రూప్ లో జిక్యూజి భాగస్వాముల పెట్టుబడులు పెరిగాయి.

ఈ నేపథ్యంలో మళ్లీ ఆదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పెరగడం ప్రారంభమైంది. దాంతో, ఆదానీ నికర సంపద 64.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. దాంతో, గౌతమ్ ఆదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో 18వ స్థానానికి చేరారు. మే 23న ఒకేరోజు ఆదానీ గ్రూప్ లోని 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 63,418.85 కోట్లు పెరిగి, మొత్తంగా రూ. 10.16 లక్షల కోట్లకు చేరింది.