కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో జాతీయ జెండా

మరో కొద్దీ నెలల్లో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ఈ సారి 21 రోజుల పాటు పండుగ వాతావరణంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు భారీ సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం రూ 105 కోట్ల నిధులను సహితం విడుదల చేశారు.
 
ఈ మూడు వారాలలో తన ప్రభుత్వ విజయాలకు విశేష ప్రచారం కల్పించడం ద్వారా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు కాగలదని భావిస్తున్నారు.  అయితే, అందుకు ధీటుగా  తెలంగాణ అవతరణ ఉత్సవాలను తాము కూడా నిర్వహించాలని భావిస్తున్న బీజేపీ ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సారథ్యంలో నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
 
జూన్ 2న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేయాలని భావిస్తోంది.ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆహ్వానించాలని యోచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలకు బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని వేడుకల నిర్వహణను పర్యవేక్షిస్తున్న కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
 
తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గోల్కొండ కోటలో కాషాయ జెండా ఎగురవేస్తామని బిజెపి నేతలు పదే పదే ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ అవతరణ ఉత్సవాలను గోల్కొండలో జరపడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించడంతో పాటు తెలంగాణ అవతరణ, అభివృద్ధిలో తమ పాత్ర ఏ మేరకు ఉందనే విషయాన్ని చెప్పాలని బీజేపీ భావిస్తోంది.
గతంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. తాజాగా అదే విధంగా తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని కూడా నిర్వహించాలని అనుకుంటున్నారు. అదే రోజు సాయంత్రం అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.