బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండకపోవచ్చు

తెలంగాణాలో ఎన్నికల ముందు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను మార్చడం ఉండకపోవచ్చని బిజెపి ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. బండి సంజయ్ తన శక్తి మేరకు పని చేస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్నికలు దగ్గరలో ఉన్నందున ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని అంటూ తనను ఎలా వాడుకోవాలో బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుందని తెలిపారు.

తనకు అధ్యక్ష పదవి ఇవ్వరని, అలాంటి అవకాశం లేదని చెబుతూ తన సేవలు ఎక్కడ అవసరమైతే పార్టీ అక్కడ ఉపయోగించుకుంటోందని చెబుతూ  అప్పుడైనా.. ఇప్పుడైనా పదవి కావాలని అడిగే వ్యక్తిని కాదని చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై వస్తోన్న ఊహాగానాలు తప్పు అని పేర్కొంటూ జాతీయ పార్టీలో ఢిల్లీ నేతలు ఇక్కడికి రావడం, తాము ఢిల్లీ వెళ్లడం సహజం అని రాజేందర్ చెప్పారు.

రానున్న ఎన్నికల్లో గెలవాలంటే తమ శక్తిని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉందని అంటూ ఎన్నికల్లో గెలవాలంటే కార్యకర్తల బలం పెంచుకోవడంతోపాటు ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతలు రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం అందర్నీ భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు.

బిజెపిలో తాను ఇమడలేకపోతున్నానని, తనకు బండి సంజయ్ కు గొడవ జరిగిందని జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ తాను గొడవలు పడే వ్యక్తిని కాదని పేర్కొన్నారు.  అయితే,ఏ పార్టీలోనైనా కొత్త నాయకుడు చేరినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎదురు కావడం సహజమేనని, కొత్త, పాత నేతలు సర్దుకోవడానికి సమయం పడుతుందని చెప్పారు.
 
అయినప్పటికీ బిజెపిలో పాత, కొత్త నేతల మధ్య ఎటువంటి వివక్ష, వివాదాలు లేవని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఒక పార్టీలో సుదీర్ఘకాలం కీలక హోదాల్లో పనిచేసిన ఓ నాయకుడు కొత్తపార్టీలో చేరినప్పుడు సమస్యలు ఎదురవుతాయని, అవి ఏ పార్టీలోనైనా సహజమేనని తెలిపారు. ఇతర పార్టీల నుండి వచ్చే నేతల అనుభవాన్ని పార్టీ బలోపేతం చేయడంకోసం ఉపయోగించుకోవాలని బిజెపి పెద్దల ఉద్దేశమని ఈటల పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజా క్షేత్రం లో పేరున్న వారికే టికెట్లు వస్తాయని వెల్లడించారు. పొంగులేటి, జూపల్లి ని ఈ మధ్య బీజేపీ పార్టీ లో చేరమని అడిగానని, అయితే తమ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం అన్నారని ఈటల స్పష్టం చేశారు. కాగా, ఇటీవల తెలంగాణ కేబినెట్ 111 జీవోను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై స్పందిస్తూ వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి కేసీఆర్‌కు డబ్బులు కావాలని, అందుకే 111 జీవోను రద్దు చేశారని ఆరోపించారు. 111 జీవో రద్దుతో హైదరాబాద్ కాంక్రీట్ జంగల్ కాబోతుందని హెచ్చరించారు.

ఇందులో రైతుకు మేలు జరిగేది ఏమీ లేదని అంటూ ఈ జీవో రద్దుతో మళ్లీ బీఆర్ఎస్ నేతలు వందల కోట్లకు పడగలెత్తుతారని ధ్వజమెత్తారు. 111 జీవో రద్దుతో పర్యావరణ విధ్వంసం చేస్తారా? అంటూ ఈటల ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు ఎవరిపైనా నమ్మకం లేదని పేర్కొంటూ అహంకారపూరిత ధోరణితో ముందుకెళ్లడం మంచికాదని హితవు చెపపరు. 111 జీవో రద్దు నిర్ణయంపై సమీక్షించాలని ఆయన కోరారు.

కొంతమందికి అనుమతి ఇచ్చి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై కొంతమంది గ్రీన్ ట్రిబ్యునల్‌కి వెళ్లే ఛాన్స్ ఉందని ఈటల చెప్పారు. చంద్రబాబు, వైఎస్సార్ నిషేధిత జాబితాలో ఉన్న భూములను వారి అనుయాయులకు కట్టబెట్టి వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇపుడు అదే పని చేస్తున్నారని  ఈటెల విమర్శించారు. జంట జలాశయాలు తాగునీరు కోసం మాత్రమే కాదు, వరదల నివారణ కోసం నిర్మించారని ఆయన గుర్తుచేశారు.

‘వికారాబాద్ కా హవా లాఖో మరీజౌంక దవా‘ అని అన్న ముఖ్యమంత్రే ఇప్పుడు విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. భూ సమస్యలకు పరిష్కారం అని చెప్పి తెచ్చిన ధరణి రైతుల కొంప ముంచిందని ధ్వజమెత్తారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకోసం ఒక్క గజం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కర్ణాటక గెలవగానే దేశమంతా కాంగ్రెస్ గెలుస్తుందా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మీరు, మీ పార్టీనీ కాపాడుకొండని ఆయన సూచించారు.