
ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా చివరిలో ఆస్ట్రేలియాలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌తో వివిధ అంశాలపై జరిపిన చర్చలలో ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలో హిందూ ఆలయాలు, ప్రార్థనా మందిరాలపై జరుగుతున్న దాడులు కూడా ప్రస్తావనకు వచ్చాయి. కొంతకాలంగా ఆస్ట్రేలియాలో హిందూ ఆలయాలపై దాడులు, ఖలిస్థానీ వేర్పాటువాద అనుకూల శక్తుల కార్యకలాపాల గురించి భారత ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై గతంలోనూ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌తో చర్చించానని, ప్రస్తుతం మళ్లీ మాట్లాడుకున్నామని ఆయన తెలిపారు.
‘ఆస్ట్రేలియాలో ప్రార్థనా స్థలాలపై జరుగుతున్న దాడులు, వేర్పాటువాద శక్తుల కార్యకలాపాల గురించి అల్బనీస్, నేను గతంలో చర్చించాం. ఇప్పుడు కూడా ఈ అంశం మా మధ్య ప్రస్తావనకు వచ్చింది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలకు హాని కలిగించే చర్యలను మేము ఎంతమాత్రం సహించం. అలాంటి మూకలపై కఠిన చర్యలు తీసుకుంటామని అల్బనీస్ మరోసారి హామీ ఇచ్చారు’ అని చర్చల అనంతరం అల్బనీస్ సమక్షంలో చేసిన మీడియా ప్రకటనలో మోదీ చెప్పారు.
అలాగే ఇరువురు నేతలు తరచూ సమావేశం కావడంపైనా మోదీ స్పందించారు. ‘ గత ఏడాది కాలంలో మేం ఆరుసార్లు కలుసుకున్నాం. ఇది రెండు దేశాల మధ్య బలమైన బంధాన్ని ప్రతిబింబిస్తోంది. క్రికెట్ భాషలో చెప్పాలంటే రెండుదేశాల సంబంధాలు టి20 మోడ్‌లోకి ప్రవేశించాయి’ అని మోదీ సరదాగా వాఖ్యానించారు.
అల్బనీస్‌తో తన చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయన్న మోదీ ఆస్ట్రేలియా- భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లడంపై తాము చర్చించినట్లు తెలిపారు. కాగా ఈ ఏడాది భారత్‌లో జరిగే క్రికెట్ వరల్డ్ కప్‌ను వీక్షించేందుకు అల్బనీస్, ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులను ప్రధాని మోదీ ఆహ్మానించారు. అదే సమయంలో వైభవంగా జరిగే దీపావళి వేడుకలను కూడా వీక్షించవచ్చని సూచించారు.
చర్చలలో భాగంగా రక్షణ, భద్రత; వ్యాపారం, పెట్టుబడులు; నూతన, నవీకరణ యోగ్య శక్తి, గ్రీన్ హైడ్రోజన్, ముఖ్య ఖనిజాలు, విద్య, ప్రవాసం, ఇంకా గతిశీలత, ఉభయ దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలలో సహకారం పైన దృష్టి ని కేంద్రీకరించారు.
కాగా, బెంగళూరులో కొత్త ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రధానంగా ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలను శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత డిజిటల్ ఎకానమీని, వినూత్నమైన పర్యావరణ వ్యవస్థతో అనుసంధానం చేయడానికి దోహదపడుతుందని ఈ సందర్భంగా అల్బనీస్ చెప్పారు.
చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య విద్యార్థులు, విద్యావేత్తలు, పరిశోధకులు, వ్యాపారవేత్తల రాకపోకలకు వీలు కల్పించడంతో పాటుగా అక్రమ వలసలను అరికట్టే మైగ్రేషన్, మొబిలిటీ పార్టనర్‌షిప్ ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. దీనితో విద్యార్థులు, వృత్తినిపుణులు, పరిశోధకులు, విద్య రంగ నిపుణులు తదితరులు విరివిగా రాకపోకలు జరపడానికి మార్గం సుగమం అవుతుంది. దీనిలో ప్రత్యేకించి భారతదేశం కోసం రూపొందించినటువంటి ఎమ్ఎటిఇఎస్ (మొబిలిటీ అరేంజ్ మెంట్ ఫార్ టాలంటెడ్ అర్లి ప్రొఫెశనల్స్ స్కీమ్) పథకం తాలూకు ఒక నూతన నైపుణ్య మార్గం కూడా ఒక భాగంగా ఉన్నది.
ఇద్దరు నేతలు నియమాలపై ఆధారపడి ఉండే అంతర్జాతీయ వ్యవస్థకు అనుకూలంగా వ్యవహరించగల శాంతిపూర్ణమై, సమృద్ధమైన, సంబంధిత వర్గాలు అన్నింటిని కలుపుకొని పోయేటటువంటి ఇండో-పసిఫిక్ రీజియన్ ను ఆవిష్కరించాలనే తమ దృఢ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. వారు ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో సంస్కరణల అంశాన్ని గురించి కూడా చర్చించారు.
More Stories
రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం.. అందుకే సీబీఐ విచారణ
మార్గదర్శి ఎండి శైలజను ప్రశ్నించిన ఏపీ సిఐడి
క్రికెట్ బుకీని పట్టించిన అమృతా ఫడ్నవీస్