కరోనా కన్నా ప్రాణాంతక వ్యాధి రాబోతోంది

మరో ప్రాణాంతక వైరస్ ప్రపంచాన్ని కబళించబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ కరోనా మహమ్మారి పీడ విరగడ కాకముందే హెచ్చరించారు. కరోనా ఇక ఎంతోకాలం ఆరోగ్య అత్యవసర పరిస్థితికి సంబంధించిన వ్యాధి కాదని డబ్ల్యూహెచ్ఓ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

డాక్టర్ టెడ్రోస్ డబ్ల్యూహెచ్ఓ 76వ ప్రపంచ ఆరోగ్య  అసెంబ్లీలో మాట్లాడుతూ, తదుపరి మహమ్మారిని నిరోధించేందుకు చర్చలు జరపవలసిన సమయం ఇది అని చెప్పారు. కరోనా మహమ్మారి ఇంకా ముగిసిపోలేదని, మరొక వేరియంట్ ముప్పు రాబోతోందని హెచ్చరించారు. దీనివల్ల వ్యాధి ప్రబలుతుందని, మరణాలు సంభవిస్తాయని చెప్పారు.

‘కరోనా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీకి ముగింపు ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగా ఉన్న కరోనాకు ముగింపు కాదు. కొత్తగా వైరస్ వ్యాప్తి, మరణాల పెరుగుదలకు కారణమయ్యే మరో వేరియంట్ ముప్పు ఇంకా మిగిలే ఉంది. ప్రాణాంతకమైన సంభావ్యతతో ఉద్భవించే మరొక మహమ్మారి ముప్పు కూడా పొంచి ఉంది’ అని ఆయన స్పష్టం చేశారు.

 మరింత ప్రాణాంతక రోగకారకం ముప్పు ఉందని చెబుతూ తదుపరి ప్రపంచ వ్యాధి ప్రపంచం తలుపు తట్టబోతోందని హెచ్చరించారు. దీనిని దేశాల ప్రభుత్వాలు మట్టుబెట్టడం, చర్యలను వాయిదా వేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిందని, అప్పట్లో ప్రపంచం ఈ వ్యాధిని ఎదుర్కొనడానికి సంసిద్ధంగా లేదని చెప్పారు.

శతాబ్దంలో అత్యంత తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం ఇదేనని పేర్కొంటూ గడచిన మూడేళ్లలో దీనివల్ల ప్రపంచం తలకిందులైందని గుర్తు చేశారు. దాదాపు 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. కానీ మరణాల సంఖ్య అంతకన్నా ఎక్కువే ఉంటుందని, కనీసం రెండు కోట్ల మంది మరణించి ఉండవచ్చునని చెప్పారు.

తప్పనిసరిగా చేయవలసిన మార్పులను మనం చేయకపోతే, ఎవరు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఆ మార్పులను మనం ఇప్పుడే చేయకపోతే, ఎప్పుడు చేస్తామని అడిగారు. తదుపరి మహమ్మారి తలుపు తట్టినపుడు – అది తప్పకుండా వస్తుంది – దానికి సమాధానం చెప్పడానికి మనం నిర్ణయాత్మకంగా, సమష్టిగా, న్యాయంగా, నిష్పాక్షికంగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.

వివిధ రకాల సమస్యలు మూకుమ్మడిగా పుట్టుకొస్తున్న నేపథ్యంలో అన్ని సందర్భాలకూ తగిన ప్రపంచ స్థాయి వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచించారు. ‘‘మరో సంక్షోభం కచ్చితంగా వస్తుంది. అప్పుడు దాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు సమన్యాయంతో ఉమ్మడిగా నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి’’ అని పిలుపునిచ్చారు.

ఈ తరం నిబద్ధతతో వ్యవహరించడం ముఖ్యమని చెప్పారు. ఓ చిన్న వైరస్ ఎంత భయంకరమైనదో ఈ తరం అనుభవపూర్వకంగా తెలుసుకుందని తెలిపారు.  ప్రజారోగ్యానికి అతిపెద్ద ముప్పు కలిగించగలిగే తొమ్మిది ముఖ్యమైన వ్యాధులను డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. ఇవి మహమ్మారిగా మారగలవని, వీటికి చికిత్స లేదని, అందువల్ల ఇవి అత్యంత విపత్కరమైనవని గుర్తించింది.