పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం రాజకీయం చేయవద్దు

భారత దేశ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం నవ భారతాన్ని, ప్రాచీన సంప్రదాయాలతో అనుసంధానం చేయడమని కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా అభివర్ణించారు. దీనిని రాజకీయం చేయవద్దని ఆయన ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు. దీని గురించి ప్రజలను ఆలోచించనిద్దామని, వారికి నచ్చిన విధంగా స్పందించనిద్దామని చెప్పారు.

నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 28న ప్రారంభించబోతున్నారు. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్న 19 ప్రతిపక్ష పార్టీల నిర్ణయంపై ఆయన స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిఒక్కరిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిందని, అయితే ఎవరి మనోభావాల మేరకు వారు స్పందిస్తారంటూ తెలిపారు.

ఇదిలావుండగా, గతంలో జరిగిన ఇటువంటి కార్యక్రమాలను కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి గుర్తు చేశారు. 1975 ఆగస్టులో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పార్లమెంటు అనెక్స్‌ను ప్రారంభించారని, 1987లో అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ పార్లమెంటు గ్రంథాలయాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. మీ (కాంగ్రెస్) ప్రభుత్వాధినేత వాటిని ప్రారంభించినపుడు, మా (ఎన్డీయే) ప్రభుత్వాధినేత ఇప్పుడు అదే పని ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు.
 
నూతన పార్లమెంట్ లో రాజదండం
పార్లమెంటు భవనంలోని లోక్ సభ జరిగే హాల్ లో స్పీకర్ స్థానానికి సమీపంలో ఒక రాజదండాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ రాజదండానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది.  తమిళ రాజరిక సంస్కృతితో, ముఖ్యంగా చోళుల కాలంలో ఇది విడదీయలేని భాగం. ముఖ్యంగా ఒక రాజు నుంచి మరొక రాజుకు అధికార మార్పిడి జరిగే సమయంలో ఈ బంగారు రాజదండాన్ని కొత్తగా రాజుగా బాధ్యతలు స్వీకరిస్తున్న వ్యక్తికి అందజేస్తారు. 1947 ఆగస్ట్ 15న బ్రిటిష్ వారి నుంచి పాలన బాధ్యతలను స్వీకరిస్తున్న సమయంలో కూడా.. రాజ్య పాలన బదిలీకి ప్రతీకగా ఈ రాజదండాన్ని నెహ్రూ అందుకున్నారు.
 
స్వతంత్ర భారతదేశానికి అధికార మార్పిడి సందర్భంగా లభించిన రాజదండాన్ని మే 28న జరిగే నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో తమిళనాడుకు చెందిన ప్రముఖులతో కూడిన ప్రతినిధి బృందం ప్రధాని నరేంద్ర మోడీకి అంచేస్తుందని అమిత్ షా తెలిపారు. బంగారంతో చేసిన ఈ రాజదండం ఐదు అడుగుల పొడవుతో ఉంటుంది. పై భాగంలో కూర్చున్న భంగిమలో నంది ఉంటుంది.
భారత్ స్వాతంత్య్రం పొందిన సమయంలో.. భారత్ కు స్వాతంత్య్రాన్ని, పాలన బాధ్యతలను అప్పగించడానికి ప్రతీకగా ఏం చేయాలని నాటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ జవహర్ లాల్ నెహ్రూ ని అడిగారు. ఏం చేయాలో పాలుపోని నెహ్రూ  ఈ సమస్యను సహచర నేత సి రాజగోపాలా చారి ముందు పెట్టారు.
బ్రిటన్ నుంచి భారత్ కు అధికార మార్పిడిని సూచించే సంకేతంగా ఏం చేస్తే బావుంటుందని ఆలోచించిన రాజగోపాలా చారికి తమిళ సంస్కృతిలో భాగమైన రాజదండం గుర్తుకు వచ్చింది.
చోళుల కాలం లో అధికార మార్పిడికి చిహ్నంగా ఈ రాజదండాన్ని కొత్త రాజుకు అందించేవారన్న విషయం గుర్తుకు రావడంతో, ఆయన నేరుగా చెన్నైలో సంప్రదాయ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరువదుతురై ఆశ్రమానికి వెళ్లారు.  ఆ మఠాధిపతి, ఆధ్యాత్మిక గురువును సందర్శించి ఈ సమస్యను ఆయనకు విన్నవించారు.
దాంతో, ఆ గురువు రాజదండాన్ని తయారు చేసే బాధ్యతను వుమ్మిడి బంగారు చెట్టి అనే ప్రఖ్యాత నగల వర్తకుడికి అప్పగించారు. వుమ్మిడి బంగారు చెట్టి ఐదడుగుల పొడవుతో, పైన నందితో అద్భుతమైన రాజదండాన్ని రూపొందించి, రాజగోపాలాచారికి అందించారు. ఆ రాజదండాన్ని లార్డ్ మౌంట్ బాటన్ కు ఇచ్చి, ఆ తరువాత అతడి నుంచి ఆ రాజదండాన్ని తీసుకుని గంగాజలంతో అభిషేకించి, స్వాతంత్ర్యం పొందడానికి సరిగ్గా 15 నిమిషాల ముందు జవహర్ లాల్ నెహ్రూకి అందించారు.
 
19 ప్రతిపక్షాల బహిష్కరణ
 
కాగా, ఈ కార్యక్రమానికి హాజరుకాబోమని 19 ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా ప్రకటించాయి. రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి మోదీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని, పార్లమెంటుకు ఆత్మ వంటి ప్రజాస్వామ్యానికే చోటు లేనప్పుడు కొత్త భవనానికి ఇక ఎలాంటి విలువ లేదని ఆరోపించాయి.
 
కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, జార్ఖాండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విడుదలై చిరుతైగళ్ కట్చి, రాష్ట్రీయ లోక్‌ దళ్, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), ఎన్‌సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఎండీఎంకే ఈ ప్రకటనను విడుదల చేశాయి. ఆంధ్ర ప్రదేశ్‌లోని తెలుగు దేశం పార్టీ, వైసిపి ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు తెలిపాయి. అదేవిధంగా పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్, ఒడిశా అధికార పార్టీ బీజేడీ కూడా హాజరుకాబోతున్నట్లు ప్రకటించాయి. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ గురువారం ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్రంలోని అధికార కూటమి ఎన్డీయే పక్షాలు హాజరవుతాయి.