ఆదాయాలు వెల్లడించని 4 వేల మదర్సాలపై యోగీ సర్కార్ కన్నెర్ర

ఉత్తర్ ప్రదేశ్ లో ప్రభుత్వ గుర్తింపులేని మదర్సాలపై (ఇస్లాం బోధించే స్కూళ్లు) యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ చర్యలకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో కుప్పలు తెప్పలుగా ఏర్పాటు చేసిన మదర్సాలు గుర్తింపు కూడా తీసుకోకుండా పనిచేస్తున్నాయి. అలాగే వాటి ఆదాయ మార్గాల్ని కూడా వెల్లడించడం లేదు.
 
రాష్ట్రంలో ఇలాంటి నాలుగు వేలకు పైగా మదర్సాలను ప్రభుత్వం గుర్తించింది. యూపీ బీజేపీ ప్రభుత్వం తమ ఆదాయ వనరులను వెల్లడించనందుకు రాష్ట్రంలోని 4,000 పైగా మదర్సాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. మదర్సా బోర్డు పరీక్షల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీటిపై చర్యల్ని వాయిదా వేసింది. అవి ముగియడంతో ఇప్పుడు చర్యలు తీసుకునే అవకాశముంది.
 
రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లేని మదర్సాలపై రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సర్వే నిర్వహించింది. సర్వే నివేదికలో 8441 మదర్సాలు అక్రమంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. వీటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. మదర్సాల నిధులపై విచారణలో వారిలో కొందరు సౌదీ అరేబియా, నేపాల్, బంగ్లాదేశ్, కొన్ని ఇతర దేశాల నుండి డబ్బు పొందినట్లు తేలింది.
 
మదర్సా నిర్వాహకులు నిధులకు సంబంధించిన అన్ని పత్రాలను కూడా అందించారు. మరింత అధ్యయనం తర్వాత ఆదాయ వనరులను వెల్లడించని మదర్సాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నేపాల్‌కు ఆనుకుని ఉన్న జిల్లాల్లో గుర్తింపులేని మదర్సాల నెట్‌వర్క్ మొత్తం విస్తరించి ఉందని సర్వేలో వెల్లడైంది.


ఈ సంవత్సరం ప్రారంభంలో, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2021-22 సంవత్సరానికి రూ. 5,50,270 కోట్లతో బడ్జెట్‌ను సమర్పించింది. ఇందులో మైనారిటీలతో పాటు సమాజంలోని అన్ని వర్గాలకు వరాలు ప్రకటించింది. ప్రస్తుత సంవత్సర బడ్జెట్‌ను ఆవిష్కరించిన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి సురేశ్ ఖన్నా మాట్లాడుతూ యూపీ సర్వతోముఖాభివృద్ధి, రాష్ట్రాన్ని స్వావలంబనగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
 
మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ పథకం కోసం రూ.829 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని మదర్సాల ఆధునీకరణ పథకానికి రూ.479 కోట్ల ప్రతిపాదన చేశారు.