త్రిపుర రాష్ట్ర టూరిజం అంబాసిడర్‌గా గంగూలీ

భారత క్రికెట్‌ దిగ్గజం, టీం ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ  కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు. గంగూలీని త్రిపుర టూరిజం అంబాసిడర్‌  గా నియమిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గంగూలీని కోల్‌కతాలోని ఆయన నివాసంలో త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత్‌ చౌదరి సమావేశమై తమ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేశారు. వారి ప్రతిపాదనను గంగూలీ అంగీకరించారు.

‘త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలనే మా ప్రతిపాదనను భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంగీకరించడం గర్వించదగ్గ విషయం. ఈ రోజు నేను ఆయనతో టెలిఫోన్‌లో సంభాషించాను. అతని భాగస్వామ్యం ఖచ్చితంగా త్రిపుర రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రోత్సాహాన్ని ఇస్తుందని నేను విశ్వసిస్తున్నాను’ అని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా తెలిపారు.

కాగా, గంగూలీ వచ్చే నెల ప్రారంభంలో విదేశీ పర్యటకు వెళ్లనున్నారు. పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత జూన్‌ చివరిలో త్రిపుర రాజధాని అగర్తలాలో పర్యటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.