కేసీఆర్ ప్రభుత్వం ఏం సాధించిందని దశాబ్ది ఉత్సవాలు?

కేసీఆర్ ప్రభుత్వం ఏం సాధించిందని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ‘‘కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా? దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా? ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకే ఈ జిమ్మిక్కు’’అని ధ్వజమెత్తారు.

రాష్ట్రపతితో పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను కొట్టిపారేశారు. రాష్ట్రపతిని ఓడించాలనుకున్నోళ్లే ఆమెపై మొసలి కన్నీరు కారుస్తుండటం సిగ్గు చేటన్నారు. గత మూడేళ్లలో ఏనాడూ డిపాజిట్లు కూడా రాని కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని కొన్ని పత్రికలు ప్రచారం చేయడం విడ్డూరమని ఎద్దేవా చేయారు.

కరీంనగర్ లో వివిధ అభివ్రుద్ధి పనులకు భూమి పూజ చేసిన సంజయ్ కుమార్ అనంతరం మీడియాతో మాట్లాడారు.  కేసీఆర్ పాలనపై, అవినీతిపై ప్రజల ద్రుష్టి పడకుండా ఉండేందుకు ఎన్నికల ఏడాదిలో కొత్త జిమ్మిక్కులకు తెరదీసిండని తెలిపారు. కేసీఆర్ పాలనలో ఇచ్చిన హమీలెన్ని? అమలు చేసినవెన్ని?  ఇచ్చిన హామీలెందుకు నెరవేర్చలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి? అని నిలదీశారు.

కర్ణాటక ఎన్నికలకు, తెలంగాణకు సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్ గెలుస్తదా? కాంగ్రెస్ తెలంగాణలో ఏ విధంగా అధికారంలోకి వస్తుంది? అని నిలదీశారు.  2018లో కాంగ్రెస్ నుండి 19 మంది గెలిస్తే 12 మంది హోల్ సేల్ గా బీఆర్ఎస్ లోకి వెళ్లారని అంటూ ఇప్పుడున్న 5 గురిలో నలుగురు నాలుగు దిక్కులు చూస్తున్నరని, ఇంకొకాయన చౌరస్తాలో నిలబడి ఉన్నరని సంజయ్ ఎద్దేవా చేశారు.

2018 ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచిందని, ఆ తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగిందని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 స్థానాలు గెలిచామని, బిజెపికి, బీఆర్ఎస్ కు 6 వేల ఓట్లు మాత్రమే తేడా అని తెలిపారు.

హుజూరాబాద్, దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని,మొన్న జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచిందని చేప్పారు. ఇట్లా ప్రతి ఎన్నికల్లో బీజేపీ గెలుస్తూ ఓటు బ్యాంకును పెంచుకుంటే… కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావడం లేదని పేర్కొంటూ ఏ విధంగా అధికారంలో వస్తుంది? అని ప్రశ్నించారు.