14న హైదరాబాద్ లో యూఏఈ కాన్సులేట్

హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్న కాన్సులేట్ ను యూఏఈ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి అహ్మద్ అలీ అల్ సాయేఘ్ జూన్ 14న ప్రారంభిస్తారని భారత్ లో యూఏఈ కాన్సుల్ జనరల్ ఆరెఫ్ అల్నైమి తెలిపారు.

భారత్ లో ఇప్పటివరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశానికి చెందిన మూడు కాన్సులేట్స్ ఉన్నాయి. నాలుగో కాన్సులేట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ సహా దక్షిణాది ప్రాంతంతో యూఏఈ కి చారిత్రక సంబంధాలు ఉన్నాయి. అందువల్ల హైదరాబాద్ లో యూఏఈ కాన్సులేట్ ఏర్పాటవడం వల్ల ఈ ప్రాంత వాసులు యూఏఈ వీసా పొందడం సులభమవుతుంది.

 అలాగే, హైదరాబాద్ లో యూఏఈ కాన్సులేట్ ఏర్పాటవడం వల్ల భారత్, యూఏఈ వాణిజ్య సంబంధాలు మరింత మెరుగవుతాయి. ఐటీ, హెల్త్ కేర్ రంగాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. ఇప్పటివరకు న్యూఢిల్లీ, ముంబై, తిరువనంతపురంలలో యూఏఈ కాన్సులేట్స్ ఉన్నాయి.  ఈ కాన్సులేట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కొత్త కాన్సులేట్ లో రోజుకు రెసిడెంట్ వీసాలు సహా గరిష్టంగా 300 వీసాలు జారీ చేయనున్నారు.

యూఏఈ పౌరులు హైదరాబాద్ కు వివిధ కారణాలతో తరచుగా వస్తుంటారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ కోసం, మెడికల్ చెకప్స్, చికిత్సల కోసం హైదరాబాద్ కు వస్తుంటారు. అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ ఆసుపత్రుల్లో చికిత్స అందుతుండడం అందుకు ప్రధాన కారణం. యూఏఈలో ప్రస్తుతం సుమారు 28 లక్షల మంది భారతీయులున్నారు.

 పశ్చిమాసియాలో అత్యధికంగా భారతీయులున్న మరో దేశం యూఏఈనే. భారత్, యూఏఈలో మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 60 బిలియన్ డాలర్లు. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో 8% యూఏఈ నుంచే వస్తుంది.