సికింద్రాబాద్ – నాగపూర్ మధ్య వందే భారత్

సికింద్రాబాద్ నుంచి మూడు నెలల సమయంలోనే రెండు వందేబారత్ రైళ్లు ప్రారంభించారు. సికింద్రాబాద్ – విశాఖ, సికింద్రబాద్ – తిరుపతి వందేభారత్ సెమీ హై స్పీడ్ రైళ్లు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో కొత్తగా మరో మూడు వందేభారత్ రైళ్ల కోసం ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి.
 
అందులో కాచిగూడ – బెంగళూరుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రూటు కూడా ఖరారు అయింది. అధికారిక ఆమోదం లాంఛనమే. ఇదే సమయంలో విశాఖ – భువనేశ్వర్ మధ్య వందేభారత్ పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ సమయంలోనే సికింద్రాబాద్ – పూణే మధ్య వందేభారత్ ప్రతిపాదనల తయారీ సమయంలో తాజాగా సికింద్రాబాద్ – నాగపూర్ మధ్య ప్రారంభించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 
హైదరాబాద్ – నాగపూర్ మధ్య ప్రయాణీకుల రాకపోకలు పెద్దసంఖ్యలో ఉంటాయి. ఈ మార్గంలో ప్రస్తుతం 25 రైళ్లు నడుస్తున్నాయి. కానీ, సూపర్ ఫాస్ట్ రైళ్లు రద్దీకి అనుగుణంగా అందుబాటులో లేవు. సికింద్రాబాద్ – నాగపూర్ మధ్య 581 కిలీ మీటర్ల దూరం ప్రయాణానికి ప్రస్తుతం రైళ్లల్లో దాదాపు 10 గంటల సమయం తీసుకుంటుంది.
 
కొత్తగా అధికారులు ప్రతిపాదించిన వందేభారత్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం 6.30 గంటలుగా ఉండనుంది. దీంతో దాదాపు నాలుగు గంటల ప్రయాణ సమయం కలిసి వస్తుంది. ఈ కొత్త వందేభారత్ ప్రకటన దిశగా కసరత్తు వేగవంతం చేసారు. షెడ్యూల్ కూడా ఖరారైంది. భువనేశ్వర – హైదరాబాద్ మధ్య ప్రతిపాదన ఉన్నా విశాఖ – భువనేశ్వర్ మధ్య నడిపేలా ప్రత్యామ్నాయ ప్రణాళికలపైనా కసరత్తు జరుగుతోంది.
 
ఇప్పుడు హైదరాబాద్ నుంచి నాగపూర్ వందేభారత్ మధ్యలో బలార్షా, సిర్పూర్ కాగజ్ నగర్, రామగుండం, ఖాజీపేట జంక్షన్లలో ఆగేలా నిర్ణయించినట్లు తెలుస్తోంది. నాగపూర్ లో ఉదయం 6 గంటలకు బయల్దేరి మధ్నాహ్నం 12.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి సికింద్రాబాద్ లో మధ్నాహ్నం 1.30 గంటలకు బయల్దేరి రాత్రి 8 గంటలకు నాగపూర్ చేరుకోనుంది.
 
ఒడిశా ప్రభుత్వం నుంచి అయిదు వందేభారత్ రైళ్ల కోసం ప్రతిపాదనలు అందించింది. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భువనేశ్వర్ – సికింద్రాబాద్, పూరీ – విశాఖ మధ్య ప్రతిపాదన పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి కొత్త వందేభారత్ రైళ్లు మరిన్ని అందుబాటులోకి రావటం ఖాయంగా కనిపిస్తోంది.