డిసిపితో వివాదంలో నటి డింపుల్ పై క్రిమినల్ కేసు

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతిపై హైదరాబాద్ లో క్రిమినల్ కేసు నమోదైంది. ప్రభుత్వ వాహనాన్ని ధ్వంసం చేశారన్న ఫిర్యాదుపై జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. తమ కారును ఉద్దేశపూర్వకంగా డింపుల్, ఆమె స్నేహితుడు డేవిడ్ కలిసి తమ కారును ధ్వంసం చేశారని ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ ఈ ఫిర్యాదు చేయడంతో డింపుల్ హయతితో పాటు డేవిడ్‌పైనా కేసు నమోదు చేశారు.
 
జర్నలిస్ట్ కాలనీలో  డింపుల్ హయతి,  డీసీపీ రాహుల్ హెగ్డే ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు.  అయితే పార్క్ చేసిన రాహుల్ కారును డింపుల్ హయతి కాలితో తన్నడంతో పాటుగా ఆమె స్నేహితుడు డేవిడ్ తో కలిసి  ఢీ కొట్టిందని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కింద డింపుల్‌పై 353, 341, 279 సెక్షన్‌ల కింద పోలీసులు  కేసు నమోదు చేశారు.
 
ఇప్పుడే కాకుండా  డింపుల్ ఇంతకు ముందు కూడా ఇలాగే ప్రవర్తించిందని ఆ  ఫిర్యాదులో తెలిపారు. నచ్చజెప్పేందుకు పలుమార్లు ఫయత్నించినా కూడా ఆమె తీరు మార్చుకోలేదని తెలిపారు. దీంతో డింపుల్ తో పాటుగా డేవిడ్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు  పోలీసులు.  ఇద్దర్ని ఈ విషయంలో హెచ్చరించి సిఆర్పిసి 41ఎ కింద నోటీసులు ఇచ్చి, మరోసారి విచారణకు అవసరమైతే రావాలని చెప్పి పంపించారు. ఇక  ఖిలాడి, రామబాణం చిత్రాలతో డింపుల్ హయతి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
 
డీసీపీ రాహుల్ హెగ్గే కారును ఢీ కొట్టిన డింపుల్ హయతి కారు డేవిడ్ అనే వ్యక్తి  పేరుతో ఉంది.  ఈ కారుపై గత వారం  రోజులుగా చలాన్లు పడుతున్నాయి. మే 20న రాంగ్ సైడ్ పార్కింగ్, డేంజరస్ డ్రైవింగ్, నిబంధనలను ఉల్లంఘించిన వాటి పై జరిమానా ఉన్నాయి.  21న ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ ఉందని ఛలానాతో పాటు నిబంధనలు పాటించడం లేదంటూ మరో చలాన్  ఉంది. ఇలా ఆ కారుపై  రూ. 3 వేలకు పైగా జరిమానాలకు  ఛలాన్లు ఉన్నాయి.
 
ఇదే వివాదంపై స్పందించిన  ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే  డింపుల్ హయతితో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి గొడవ లేదని చెప్పారు.  గత కొన్నిరోజులుగా డింపుల్ హయతి కార్ ని తన కారుకి అడ్డంగా పెడుతుందని ఆరోపించారు. తన డ్రైవర్ చెప్పినా వినకుండా రిపీట్ చేశారని, తన కారును తన్ని ఢీ కొట్టిందని చెప్పారు.
 
 తన డ్రైవర్ చట్టం ప్రకారం జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసాడని, పోలీసులు విచారణ చేస్తున్నారని వెల్లడించారు. సీసీ ఫుటేజీలో కూడా డింపుల్ హయతి కారును కాలుతో తన్ని ఢీ కొట్టినట్టు ఉందని పేర్కొన్నారు.   మరో వైపు అధికారాన్ని అడ్డం పెట్టుకుని  తప్పును కప్పిపుచ్చుకోలేరంటూ డింపుల్ ట్వీట్ చేయడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది.
డింపుల్ ను వేధించాలనేదే డీసీపీ రాహుల్ హెగ్డే   ఉద్దేశమని ఆమె న్యాయవాది పాల్ సత్యనారాయణ ఆరోపించారు. అపార్ట్ మెంట్లో  డింపుల్ పార్కింగ్ ప్లేస్ లో కోన్స్ పెట్టారని, కోన్స్ తీయాలని చాలాసార్లు చెప్పినా డీసీపీ వినకపోవడంతో డింపుల్ కోన్స్ ని కాలుతో తన్నారని ఆయన చెప్పారు. అసలు క్వార్టర్స్ లో ఉండకుండా డీసీపీ అపార్ట్ మెంట్ లో ఎందుకు ఉంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు.