2027 గోదావరి పుష్కరాల కోసం గోదావరి నదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దడంతోపాటు పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ పేరిట సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 6 జిల్లాల్లో 262 పుష్కర పంచాయతీలను గుర్తించారు. వీటిని మురుగురహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
వీబీజీ రాంజీ పథకం కింద గృహ వినియోగ మురుగు నీటిని నియంత్రించేందుకు మ్యాజిక్ డ్రెయిన్లు, బ్లాక్ వాటర్ నిర్వహణకు సామాజిక ఇంకుడు గుంతలు, వ్యక్తిగత గృహాలలో ట్విన్ పిట్‌లను నిర్మించాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో మురుగునీరు నేరుగా గోదావరిలో కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపాలిటీ సామర్థ్యానికి తగిన విధంగా మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లను నిర్మించాలని పేర్కొన్నారు.
పట్టణ ప్రాంతాల నుండి విడుదలయ్యే మురుగునీటిని తప్పనిసరిగా శుద్ధి చేసిన తర్వాతే గోదావరిలోకి వదలాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇందుకోసం ప్రతి మున్సిపాలిటీ తమ సామర్థ్యానికి అనుగుణంగా మురుగు శుద్ధి కేంద్రాలను (ఎస్టీపీ) నిర్మించాలని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి ఇప్పటికే మంజూరు చేసిన రూ. 100 కోట్ల నిధులను, అవసరమైతే స్వచ్ఛాంధ్ర నిధులు, వీబీ జీ రాం జీ నిధులను కూడా వినియోగించుకుంటూ దశలవారీగా ఈ ప్రణాళికలను అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
గోదావరిలో మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు, ఆక్వా కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. నిత్యం 104 మిలియన్ లీటర్ల మురుగునీరు జీవనది అయిన గోదావరిని కలుషితం చేస్తోందని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల నుంచే 8.38 మిలియన్ లీటర్ల మురుగు నీరు గోదావరి నదిలో కలుస్తోందని తెలిపారు.
ఇక పరిశ్రమ వ్యర్థాల్లో ఆంధ్ర పేపర్ మిల్లు నుంచి వెలువడే రోజువారీ కాలుష్యమే 32 మిలియన్ లీటర్లు ఉంటుందని గుర్తు చేశారు. ప్రతీ రోజు గోదావరిలో కలిసే 13.24 మిలియన్ లీటర్ల ఆక్వా కాలుష్యం వీటన్నింటికీ అదనం అంటూ తేల్చి చెప్పారు. పారిశ్రామిక వ్యర్థాల్లో ఒక్క ఆంధ్ర పేపర్స్ నుంచే రోజుకు 32 మిలియన్ లీటర్ల వరకు జలాలు విడుదలవుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక కాలుష్య నియంత్రణకు నిరంతర తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
గోదావరి కాలుష్య నియంత్రణ కోసం ఆర్‌టిజిఎస్ తరహాలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కంట్రోల్ రూం నిర్వహణ బాధ్యతలను పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్‌కి అప్పగించారు. ప్రాంతాలవారీ సిసి కెమెరాలు, స్క్రీన్లు ఏర్పాటుచేసి ఎక్కడైనా మురుగు నేరుగా గోదావరిలోకి విడుదలవుతుందా అనే అంశాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
గోదావరి పరివాహకంలోని అన్ని మున్సిపాలిటీల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగంపై దశలవారీ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పర్యావరణహిత ప్రత్యామ్నాయాల వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పారిశ్రామిక వర్గాలు తగినంత పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. అలాగే, మురుగు, ద్రవరూప కాలుష్యాన్ని నియంత్రించేందుకు అన్ని పరిశ్రమలు ఆధునిక సాంకేతికతతో కూడిన శుద్ధి వ్యవస్థలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు.

More Stories
కరిగిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు
పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో బలం పెంచుకున్న బీజేపీ
నీట్ పేపర్ లీకేజీలో జవాబుదారీతనం తప్పనిసరి