అవినాష్ రెడ్డి అరెస్ట్ కు సీబీఐకి సహకరించని పోలీస్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సోమవారం కర్నూల్ వచ్చిన సిబిఐ బృందానికి ఏపీ పోలీసులు సహాయనిరాకరణ కావించారు. వరుసగా సిబిఐ విచారణకు పిలిచినా హాజరుకాకుండా వస్తున్న  అవినాష్ రెడ్డిపై తదుపరి చర్యలకు తమ ముందు లొంగిపోయే విధంగా చూడాలని కర్నూల్ ఎస్పీ కృష్ణకాంత్ ను కలిసి కోరినా స్పందన లేదు.
 
అవినాష్ రెడ్డి తల్లి నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న కర్నూలులోని విశ్వభారతి ఆస్పతి పరిసరాలకు అప్పటికే కర్నూల్, కడప, ఇతర ప్రాంతాల నుండి వైసిపి శ్రేణులు మోహరించడంతో ఇప్పుడు అదుపులోకి తీసుకొంటే శాంతిభద్రతల సమస్యలు రావచ్చని ఎస్పీ నిస్సహాయత వ్యక్తం చేసిన్నట్లు చెబుతున్నారు. సిబిఐ అధికారులు సుమారు ఎనిమిది గంటల సేపు ఎస్పీ తో సంప్రదింపులు జరిపారు.
 
ఇక ఈనెల 16, 19న రెండుసార్లు అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇవ్వగా కొన్ని కారణాలతో ఆయన విచారణకు రాలేదు. ఆ తర్వాత తన తల్లికి ఛాతీనొప్పి రావడంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించి, ఆయన కూడా అదే ఆస్పత్రిలో ఉంటున్నారు. 22న కూడా విచారణకు హాజరుకాలేనని తెలపడం, హాజరుకావాల్సిందే అని సిబిఐ స్పష్టం చేయడంతో ఉత్కంఠత నెలకొంది. ఈ పరిస్థితులలో సోమవారం ఉదయం సిబిఐ బృందం కర్నూలు చేరుకోవడంతో కలకలం చెలరేగింది.
 
ఆయన్ని అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ అధికారులు కర్నూలు వెళ్లగా ఆస్పత్రి దగ్గర అవినాష్ రెడ్డి అనుచరులు భారీగా మోహరించడంతో  కుదరలేదు. తమకు సెక్యూరిటీ కల్పించాలని సీబీఐ అధికారులు కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్‌ని కలిసి కోరగా ఆ ఎస్పీ డీజీపీ చెప్పిన ప్రకారమే చేస్తానని పేర్కొన్నారు. దాంతో సీబీఐ అధికారులు అనుకున్నది జరగలేదు.
 
మరోవంక, ఈ నెల 27 వరకు విచారణకు హాజరుకాలేనని సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ వ్రాసారు. అదే సమయంలో సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం మరోమారు పిటిషన్ దాఖలు చేశారు. అయితే సోమవారం విచారణకు రాకపోవడంతో మంగళవారం అది విచారణకు రానున్నది. హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ ముందు తన పిటిషన్‌ వినేలా ఆదేశించాలని, అవసరమైతే బెయిల్‌ ఇవ్వాలని కూడా కోరారు.
 
ఒకవేళ బెయిల్‌ ఇవ్వని పక్షంలో హైకోర్టుకు వెళ్లి వెకేషన్‌ బెంచ్‌ ముందు తాము ప్రస్తావించే వరకు సిబిఐ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.  ఇతర ప్రాంతాల నుండి పెద్దఎత్తున అవినాష్ రెడ్డి మద్దతుదారులు వస్తున్నా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు.  మీడియాపై వారు దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నా స్పందించలేదు.
వైసిపి ప్రజాప్రతినిధులు మీడియా ముందుకు వస్తే సిబిఐ అరెస్ట్ చేస్తే శాంతిభద్రతల సమస్యలు తలేత్తగలవని బహిరంగంగా హెచ్చరిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. అవినాశ్‌రెడ్డి అరెస్టును అడ్డుకుంటామంటూ ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు హల్‌చల్‌ చేశారు.  అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మీకి రెండు గుండె కవాటాలూ మూసుకుపోయాయనీ.. స్టంట్స్ వెయ్యాల్సి ఉందని డాక్టర్లు తెలిపారు. లోబీపీ ఉండటం వల్ల అప్పుడే వెయ్యలేకపోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచారు.