బీబీసీకి ఢిల్లీ హైకోర్టు బిగ్ షాక్

బ్రిటన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ న్యూస్ హౌస్ బ్రిటీష్ బ్రాడ్‌కాస్ట్ కార్పొరేషన్ (బీబీసీ), ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీపై తీసిన డాక్యుమెంటరీ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. 2002 గుజరాత్ అల్లర్లను ఉద్దేశించి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి మోదీపై బీబీసీ తీసిన ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీ వివాదాస్పదమైంది.

ప్రధానిని కించపరిచేలా ఉందంటూ దీనిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కేవలం ప్రధాని నరేంద్ర మోదీని మాత్రమే కాకుండా, దేశ ప్రతిష్టను, న్యాయవ్యవస్థను అగౌరవపర్చే విధంగా ఈ డాక్యుమెంటరీని రూపొందించారని పేర్కొంటూ ఒక ఎన్జీవో రూ. 10,000 కోట్లకు ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం దావా వేసింది. 

ఈ డాక్యుమెంటరీ భారతదేశం, న్యాయవ్యవస్థ, ప్రధానమంత్రి ప్రతిష్టను కించపరిచేలా ఉందని పేర్కొంటూ వేసిన పరువు నష్టం దావాపై ఢిల్లీ హైకోర్టు సోమవారం బీబీసీకి సమన్లు జారీ చేసింది. బీబీసీ యుకెతో పాటు,  బీబీసీ ఇండియాకు కూడా ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. గుజరాత్‌కు చెందిన  ఎన్జీవో ‘జస్టిస్ ఫర్ ట్రయల్’ దాఖలు చేసిన దావాపై ప్రతిస్పందన కోరింది. 

బీబీసీ (యుకె) లోకల్ ఆపరేషన్ ఆఫీస్  బీబీసీ ఇండియా ఈ డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఇండియా: ది మోడీ క్వశ్చన్ పేరుతో వచ్చిన ఈ సిరీస్‌లో రెండు ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ పిటిషన్‌పై  ఎన్జీవో తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు.  భారతదేశం, న్యాయవ్యవస్థ సహా మొత్తం దేశాన్ని కించపరిచేలా ఈ డాక్యుమెంటరీ రూపొందించిన  బీబీసీపై పరువు నష్టం దావా వేసినట్లు చెప్పారు. డాక్యుమెంటరీలో ఉద్దేశపూర్వకంగానే ప్రధానమంత్రిని అవమానించారని సాల్వే వాదించారు.

ఈ డాక్యుమెంటరీ పరువు నష్టం కలిగించేలా ఉందని, దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని ఆయన వాదించినట్లు పీటీఐ నివేదిక పేర్కొంది. దీంతో దీనిపై పూర్తి ఆధారాలను సమర్పించాలని బీబీసీకి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.  బీబీసీ తీసిన ‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ డాక్యుమెంటరీపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది.

2002 గుజరాత్  అల్లర్ల సమయంలో ప్రధాని మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాటి ఘనటలో ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి.  కానీ ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే బీబీసీ మాత్రం అందుకు విరుద్ధంగా, మోదీకి వ్యతిరేకంగా డాక్యుమెంటరీ తీసింది.

దీంతో ఈ సిరీస్ భారత న్యాయ వ్యవస్థపై దాడిగా బిజెపి ఆరోపించింది. తమ పార్టీని, మోదీని లక్ష్యంగా చేసుకొని బీబీసీ ఈ డాక్యుమెంటరీ తీసిందని తీవ్ర స్థాయిలో పార్టీ వర్గాలు మండిపడ్డాయి. అనంతరం పన్ను ఎగవేత ఆరోపణలతో  బీబీసీ  కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు జరిపారు. ప్రధాని మోదీపై రూపొందించిన బిబిసి డాక్యుమెంటరీని ప్రచురించకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఇటీవల ఢిల్లీ రోహిణీ కోర్టు కూడా బిబిసి కి సమన్లు జారీ చేసింది.