బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ వాట్సాప్ చాట్స్‌ను ఎందుకు లీక్ చేశారని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) మాజీ అధికారి సమీర్ వాంఖడేను బాంబే హైకోర్టు ప్రశ్నించింది. మరోసారి ఇలా చేయవద్దని, మీడియా ఎదుట మాట్లాడవద్దని చీవాట్లు పెట్టింది. 2021లో క్రూయిజ్ డ్రగ్స్ కేసులో షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో పాటు పలువురిని వాంఖడే అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఆర్యన్ ఖాన్‌ను విడుదల చేసేందుకు షారుఖ్‌ను ఆయన రూ.25 కోట్లు డిమాండ్ చేయడంతోపాటు రూ.50 లక్షలు లంచంగా తీసుకున్నట్లు సీబీఐ ఆరోపించింది. ఈ నేపథ్యంలో వాంఖడేపై అవినీతి కేసు నమోదు చేయగా దానిని కొట్టివేయాలంటూ ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన తప్పు ఏదీ లేదని నిరూపించుకునేందుకు షారుఖ్ ఖాన్ చేసిన వాట్సాప్ చాట్స్‌ను మీడియాకు లీక్ చేశారు.
తన కుమారుడి పట్ల కఠినంగా వ్యవహరించవద్దని, అతడ్ని విడుదల చేయాలంటూ వాంఖడేను షారుఖ్ ఆ చాట్స్‌లో వేడుకున్నారు. కాగా, కేసు విచారణలో ఉండగా ఇలాంటి విషయాలు లీక్ చేయడంపై సమీర్ వాంఖడేను బాంబే హైకోర్టు మందలించింది. ఈ విషయంలో ఆయన నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని, దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారని సీబీఐ ఆరోపించింది.
షారుఖ్ చాట్స్ గురించి సీనియర్ అధికారులకు తెలియజేయలేదని, అలాగే ఆ మొబైల్ ఫోన్‌ను అప్పగించలేదని కోర్టుకు చెప్పింది. నిందితుల కుటుంబ సభ్యులతో దర్యాప్తు అధికారి సంప్రదింపులు జరుపడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.
ఇరువైపు వాదనలు విన్న కోర్టు వాంఖడేకు ఊరట ఇచ్చింది. జూన్ 8న తదుపరి విచారణ జరుపుతామని పేర్కొంది. వాంఖడేపై సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇచ్చిన మధ్యంతర రక్షణను అప్పటి వరకు పొడిగించింది. మరోవైపు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విజిలెన్స్ నివేదికల ప్రకారం వాంఖడే గత ఐదేళ్లలో ఆరు విదేశీ పర్యటనలు చేశారు.
ముంబైలో నాలుగు ఫ్లాట్లతోపాటు రూ.22.05 లక్షల విలువైన రోలెక్స్ గోల్డ్ వాచ్‌ను కొనుగోలు చేసినట్లు ఆ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. కాగా, గత 96 గంటలుగా తనకు, తన భార్యకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, చంపుతామని బెదిరిస్తున్నారని సమీర్ వాంఖడే సోమవారం ఆరోపించారు. దీనిపై ముంబై పోలీస్ కమిషనర్‌కు లేఖ రాస్తానని, ప్రత్యేక సెక్యూరిటీని కోరతానని ఆయన చెప్పారు.
More Stories
జార్జ్ సోరోస్ నిధులు సమకూర్చే సంస్థతో సోనియా!
సరిహద్దు భద్రతకు డ్రోన్ వ్యతిరేక విభాగం
ప్రతిపక్షాలు ప్రజాతీర్పును స్వాగతించాలి