చెన్నైలో లిక్కర్ ఏటీఎంలు.. ఎప్పుడైనా అందుబాటులో మద్యం

ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల సమయంలో మహిళల ఓట్లను ఆకట్టుకోవడం కోసం మద్యం అమ్మకాలను నియంత్రిస్తామని, దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని అంటూ హామీలు ఇస్తుంటారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలను విచ్చలవిడిగా ప్రోత్సహించి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ప్రధాన ఆర్ధిక వనరుగా మార్చడంలో పోటీపడుతున్నారు.

ఒకప్పుడు కేవ‌లం న‌గ‌దు తీసుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డే ఏటీఎంలు ఇప్పుడు ఏకంగా బీరు, బ్రాంది, విస్కీ, రమ్ , జిన్ … ఇలా ఏ బ్రాండైనా కూడా ఏటీఎంలో తీసుకోవ‌చ్చట‌. చెన్నైలో మందుబాబులు ఏటీఎంల ముందు క్యూ కట్టే రోజులు వచ్చేశాయి.  చైన్నైలో కొత్త ఏటీఎంలు వచ్చేశాయి. ఇవి  నగదు కోసం కాదు. మద్యం కోసమట.  ఇరవై నాలుగు గంటలూ మద్యం కొనుగోలు చేసేందుకు ఈ మెషిన్లను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ప్రస్తుతానికి కోయంబేడుతో పాటు మరో మూడు చోట్ల ఈ మెషిన్లను అధికారులు ప్రారంభించారు.  తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఈ మెషిన్ల నుంచి ఎనీ టైం మందు కొనుగోలు చేయొచ్చు. ఇప్పటివరకు, మందు బాబులు మద్యం కొనుగోలు చేయాలంటే కచ్చితంగా వైన్ షాప్ కు వెళ్లి కొనుగోలు చేయాల్సిందే.

కొన్ని కొన్ని మద్యం దుకాణాల్లో మద్యం సీసాలు చేతికి రావాలంటే గంటల తరబడి వేచి ఉండాలి. పైగా, నిర్ణీత సమయాలలోనే మద్యం దుకాణాలను తెరిచి ఉంటారు.  తమిళనాడులో మద్యం షాపులను తమిళనాడు ప్రభుత్వం నడుపుతూ వస్తుంది.  ఇక మద్యంను లిక్కర్ మాల్స్, షాపింగ్ మాల్స్ కన్నా తక్కువగా అందించే విధంగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది.

మద్యం బాటిల్స్ కోసం గంటల తరబడి వేచి ఉండే పనిలేకుండా  కోక్, పెప్సీల సీసాలను ఓ పెద్ద ఫ్రిడ్జ్ నుంచి ఎలా కొనుగోలు చేస్తామో, అలాంటి వెండింగ్ మిషన్స్ను తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ తమిళ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.   మనకు కావాల్సిన మద్యంను నేరుగా కొనుగోలు చేసేలా ఈ వెండింగ్ మిషన్ ఉంటుంది. దాదాపు చెన్నై పట్టణంలోని నాలుగు చోట్ల ఈ వెండింగ్ మిషన్ ను ఏర్పాటు చేసింది.

వినియోగదారుడు ఆటోమేటిక్ లిక్కర్ వెండింగ్ మెషీన్‌ను  తాకిన క్షణంలో ఒక మెను కనిపిస్తుంది. ఆ మెనులో తనకు నచ్చిన మద్యాన్ని ఎంచుకోవచ్చు. అనంతరం డబ్బు చెల్లించే ఆప్షన్ వస్తోంది. డబ్బులను ఆన్‌లైన్‌లో లేదా నగదు రూపంలో చెల్లించాల్సి ఉంది. డబ్బులు చెల్లించిన తరువాత వినియోగదారుడు ఎంచుకున్న బాటిల్ బయటకు వస్తుంది. అయితే  దీన్ని ట్రయల్ ప్రాజెక్ట్‌గా లాంచ్ చేసినట్టు తెలుస్తోంది.

ఆచరణ యోగ్యంగా ఉంటే  మిగతా చోట్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.  ప్రస్తుతం ఈ మెషిన్లను కోయంబేడు సమీపంలోని వీఆర్‌మాల్‌, టెన్‌ స్క్వేర్‌ మాల్‌, రాయపేట ఎక్స్‌ప్రెస్‌ అవెన్యూ, వేళచ్చేరి ఫినిక్స్‌మాల్‌ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వినియోగదారులు తమకు నచ్చిన మద్యం బాటిల్‌ ధరను మెషిన్‌లో చెల్లించి నచ్చిన బాటిల్‌ పొందవచ్చు.

అయితే వెండింగ్ మెషీన్ల వల్ల మైనర్లు కూడా మద్యం కొనుగోలు చేయడాన్ని సులభతరం చేస్తాయని ప్రతిపక్ష నేతలు  విమర్శిస్తున్నారు. ఆ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానమిస్తూ మాల్స్‌లోని చేసిన ఈ  వెండింగ్ మెషీన్లలో ఉదయం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం పొందవచ్చని, 21 ఏళ్లలోపున్న వారిని దుకాణ సిబ్బంది అనుమతించరని అధికారులు తెలిపారు. ఈ మెషిన్లు అందుబాటులోకి రావడంతో ఇక మద్యం షాపులు క్రమంగా మూసివేసే అవకాశం ఉంది.

ఎనీ టైం మద్యం మెషిన్ల ఏర్పాటుపై బీజేపీ నేత ఖుష్బూ సుందర్ తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డీఎంకే సర్కారు తీసుకొచ్చిన ఎనీ టైం మద్యం మెషిన్ల ఐడియా సూపర్ గా ఉందంటూ ఆమె ఎద్దేవా చేశారు. మద్యం అమ్మకాలను తగ్గించాల్సిన ప్రభుత్వం ఆదాయం కోసం ఇలా ఇరవై నాలుగు గంట‌లు లిక్కర్ అమ్ముకునే ఏర్పాట్లు చేయడాన్ని జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలు కూడా అయిన ఖుష్బూ తప్పుబట్టారు.