కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే

తెలంగాణలో కొలువులు కావాలంటే కమలం రావాల్సిందేననే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కేంద్రంతోపాటు రాష్ట్రంలో బీజేపీ ఉంటే తెలంగాణకు ఎంతో మేలు జరిగేదని, దీనిని ద్రుష్టిలో ఉంచుకుని డబుల్ ఇంజిన్ సర్కారుంటేనే తెలంగాణలో డబుల్ అభివ్రుద్ధి సాధ్యమనే అంశాన్ని గడపగడపకూ తీసుకెళ్లాలని కోరారు.

హైదరాబాద్ లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడంతోపాటు తెలంగాణకు చేకూర్చిన ప్రయోజనాలను ఇంటింటికీ తెలియజేసేందుకు ఈనెల 30 నుండి వచ్చే నెల 30 వరకు మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా9 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు జరిగిన ప్రయోజనాలను వివరించారు.

కేసీఆర్ సర్కార్ అక్రమాలు, అవినీతి, వైఫల్యాలపై బీజేపీ నిలదీస్తుంటే కేసీఆర్ ఓర్వలేకపోతున్నడని విమర్శించారు. ఒకనాడు మోదీని విశ్వగురుగా, నిజాయితీపరుడిగా కీర్తించిన కేసీఆరే ఇయాళ అవినీతిపరుడు, రాక్షసుడంటూ తిడుతున్నడని ధ్వజమెత్తారు. బీజేపీని ఓడించేందుకు దేశమంతా తిరుగుతూ పైసలు పంచుతున్నడని మండిపడ్డారు.

విశ్వాస ఘాతకుడి పాలనలో తెలంగాణలో సబ్బండ వర్గాలు అల్లాడి పోతున్నయ్ అని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టపోయి రైతులు అల్లాడుతుంటే పట్టించుకునే నాధుడే లేడని, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నరు భరోసా ఇవ్వడం లేదని తెలిపారు. పరీక్షలు సరిగా నిర్వహించడం చేతగాకపోవడంతో విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోవడం లేదని చెప్పారు.

 చివరకు ఉద్యోగులకు జీతాలివ్వడం లేదని, డబ్బుల కోసం మద్యాన్ని ఏరులై పారించి మహిళల పుస్తెలు తెంచుతున్నడని, యువతను బానిసలుగా చేస్తున్నడు అయినా స్సందించం లేదని సంజయ్ వివరించారు.  బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి పేద, మధ్య తరగతి విద్యార్ధి ఉచితంగా ప్రైవేట్ స్కూల్స్ తో పోటీ పడేలా చదివిస్తామని ప్రకటించారు.

 బకాయిల్లేకుండా ఫీజు రీయంబర్స్ మెంట్ ను సక్రమంగా చెల్లిస్తూ అటు చిన్న చిన్న ప్రైవేటు కాలేజీలను ఆదుకుంటమని చెబుతూ ఖాళీగా ఉన్న 25 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసి ప్రేవేట్ కు దీటుగా సర్కార్ స్కూళ్లను తీర్చిదిద్ది కార్పొరేట్ దోపిడీని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణలోని ప్రతి పేద, మధ్య తరగతి వాడికి హెల్త్ కార్డు అందిస్తామని చెబుతూ ఏ జబ్బు చేసినా ఉచితంగా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని వెల్లడించారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, డాక్టర్ లక్ష్మణ్, మధ్యప్రదేశ్ ఇంఛార్జీ మరళీధర్ రావు, జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, తెలంగాణ రాష్ట్ర సహ ఇంఛార్జీ అరవింద్ మీనన్ తదితరులు పాల్గొన్నారు.