సినీ నటుడు శరత్ బాబు మృతి

సీనియర్ సినీ నటుడు శరత్ బాబు కొద్ది సేపటి క్రితం హైదరాబాదులో ప్రైవేట్ హాస్పిటల్ లో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు రెండు మాసాలుగా అనారోగ్యంతో బెంగుళూరు, ఆ తర్వాత హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్న శరత్ బాబు మృత్యువుతో పోరాడి చివరకు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో మృతిచెందారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు.
 
1951 జులై 31న శరత్‌ బాబు జన్మించారు. కళాశాలలో చదువుతున్న రోజుల్లో ఎన్నో నాటకాలు వేసిన శరత్‌బాబు 1973లో విడుదలైన ‘రామరాజ్యం’తో హీరోగా పరిచయమయ్యారు. శరత్‌ బాబు తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 250కి పైగా సినిమాలలో నటించారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా అనే సినిమాల్లో నటించారు.
 
లెజెండరీ డైరెక్టర్‌ కే బాలచందర్‌ తెరకెక్కించిన గుప్పెడు మనసు మూవీతో శరత్‌ బాబు వెలుగులోకి వచ్చారు. ఆటు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపైనా ఈటీవీ అంతరంగాలు, జనని, అగ్నిగుండాలు సీరియల్స్‌తో ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. సాగర సంగమం, స్వాతిముత్యం, గుప్పెడు మనసు, అభినందన, నోము, యమ కింకరుడు, అమరజీవి ఇలా అనేక సినిమాల్లో నటించారు.
 
ఆయన చివరిసారిగా వకీల్ సాబ్ సినిమాలో నటించారు. శరత్ బాబు కుటుంబంలో ఆయన మృతి విషాదాన్ని నింపింది. శరత్ బాబు కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి ఆమదాలవలసకు 1950 ప్రాంతంలో తరలివచ్చింది. శరత్ బాబుకు ఏడుగురు అన్నదమ్ములు, ఆరుగురు అక్క చెల్లెలు ఉన్నారు.
 
అన్నదమ్ముల్లో శరత్ బాబు మూడో వారు. సత్యన్నారాయణ దీక్షితులుగా పిలుచుకునే శరత్ బాబును ఆయన కుటుంబకులు సత్యం బాబుగా పిలుస్తారు. ఆయన సినిమా రంగ ప్రవేశం చేసిన కొన్నాళ్ల తరువాత తనకన్నా కొన్ని సంవత్సరాలు పెద్దది అయిన నటి రమాప్రభతో కొన్నేళ్లు కాపురం చేశారు. అయితే ఆ తర్వాత ఆయన రమాప్రభని పెళ్లిచేసుకోలేదు అని వివరించారు.
 
ఆ తర్వాత తమిళ నాడులో ప్రముఖ నటుడైన నంబియార్ కూతురు స్నేహలతని 1990లో వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరూ 20 ఏళ్ళు కాపురం చేశాక, 2011 సంవత్సరంలో విడిపోయారు. 200కి పైగా సినిమాలలో నటించిన శరత్ బాబు.. ఇప్పటికీ అడపా దడపా సినిమాలలో కనిపిస్తూనే ఉన్నారు. దాదాపు 5 దశాబ్దాలుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు పొందిన శరత్ బాబు మృతి చెందడం ఆముదాలవలస లో విషాదఛాయలు అలుముకున్నాయి.