అదానీ గ్రూప్ కంపెనీలకు `సుప్రీం’ బృందం క్లీన్ చిట్

అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై నిజాల నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తన నివేదికలో  అదానీ గ్రూప్ కంపెనీలకు క్లీన్ చిట్ లభించినట్లయింది. ఈ కమిటీ సమర్పించిన నివేదికను సుప్రీంకోర్టు శుక్రవారం ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
 అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్‌లో కృత్రిమ వ్యాపార ధోరణి కనిపించలేదని ఈ నివేదిక తెలిపింది.
అదానీ కంపెనీ ఎటువంటి ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డ‌లేద‌ని, రెగ్యులేట‌రీ వైఫ‌ల్యం కూడా ఏమీ లేద‌ని నిపుణుల క‌మిటీ తెలిపింది. అదానీ గ్రూపున‌కు క్లీన్ చిట్ ఇస్తున్నట్లు ఆ ప్యాన‌ల్ వెల్ల‌డించింది. అయితే సెబీ మ‌రింత విచార‌ణ చేప‌ట్టాల‌ని, ఆ త‌ర్వాతే దీనిపై పూర్తి న‌మ్మ‌కం క‌లుగుతుంద‌ని సుప్రీం ప్యాన‌ల్ తెలిపింది. 2020 నుంచి దర్యాప్తులో ఉన్న 13 విదేశీ సంస్థల యాజమాన్యాన్ని సెబీ నిర్ణయించలేకపోయినట్లు తెలిపింది.
సుప్రీంకోర్టు అదానీ గ్రూప్‌పై దర్యాప్తు కోసం ఓ కమిటీని మార్చిలో నియమించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేసింది.  దీనిలో సభ్యులుగా ఓపీ భట్, జస్టిస్ జేపీ దేవధర్, కేవీ కామత్, నందన్ నీలేకని, సోమశేఖర్ సుందరేశన్‌లను నియమించింది. ఈ కమిటీ తన నివేదికను ఇటీవల సుప్రీంకోర్టుకు సమర్పించింది.
అదానీ గ్రూపు ధ‌ర‌లను మార్చి చూప‌లేద‌ని, షేర్ల ధ‌ర‌లు పెరిగ‌న‌ట్లు ఎక్క‌డా కృత్రిమంగా చూపెట్ట‌లేద‌ని క‌మిటీ వెల్ల‌డించింది. అదానీ స్టాక్స్  విషయంలో 849 ఆటోమేటెడ్ ‘‘సస్పిషియస్’’ అలర్ట్‌లను సిస్టమ్ సృష్టించగా, వీటిని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు పరిశీలించినట్లు తెలిపింది.  నాలుగు నివేదికలను సెబీకి సమర్పించినట్లు పేర్కొంది. వీటిలో రెండిటిని హిండెన్‌బర్గ్ నివేదికకు ముందు, రెండిటిని ఆ తర్వాత అందజేసినట్లు వివరించింది. అదానీ-హిండెన్‌బర్గ్ సమస్యపై చర్చించేందుకు చాలా అంతర్జాతీయ సెక్యూరిటీస్ సంస్థలతో సంప్రదించేందుకు ప్రయత్నించామని ఈ కమిటీ సుప్రీంకోర్టుకు తెలిపింది.
అయితే అంతర్జాతీయ సెక్యూరిటీ సంస్థలు కానీ, బ్యాంకులు కానీ తమతో మాట్లాడటానికి ఇష్టపడలేదని తెలిపింది. అదానీ గ్రూప్‌తో తమకు వ్యాపార సంబంధాలు ఉన్నందువల్ల ఆసక్తుల సంఘర్షణ ఏర్పడుతుందని కొన్ని అంతర్జాతీయ సంస్థలు చెప్పినట్లు తెలిపింది. హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన తర్వాత అదానీ లిస్టెడ్ స్టాక్స్‌లో రిటెయిల్ మదుపరుల కార్యకలాపాలు పెరిగినట్లు ఈ కమిటీ నివేదిక తెలిపింది.
చట్టాల ద్వారా నియంత్రణ వైఫల్యం ఉందా? లేదా? అనేదానిని నిర్ధారించడం చాలా కష్టమని తెలిపింది. పటిష్టమైన విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది.  సెబీ అనుసరిస్తున్న లెజిస్లేటివ్ పాలసీకి అనుగుణంగా ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్ పాలసీ ఉండాలని చెప్పింది. హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలవడానికి ముందు కొన్ని సంస్థలు షార్ట్ పొజిషన్స్ తీసుకున్నాయని, హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన తర్వాత ఆ సంస్థలు లాభపడ్డాయని తెలిపింది.

ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ కేటగిరీలో దాదాపు 42 మంది మదుపరుల వివరాలు మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఈ కమిటీ నివేదికను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన వెంటనే అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక ధర 1.73 శాతం పెరిగి, రూ.1,920.70 వద్ద ట్రేడ్ అయింది. అదేవిధంగా అదానీ పోర్ట్స్ స్టాక్ ధర 1.8 శాతం పెరిగి, రూ.675.70 వద్ద ట్రేడ్ అయింది. అదానీ పవర్ 3.07 శాతం పెరిగింది. అదానీ గ్రీన్ ఎనర్జీ 2.4 శాతం, అదానీ విల్మార్ 2.6 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ 0.6 శాతం పెరిగాయి.