హైదరాబాద్‌, భోపాల్‌లో బీజేపీ అగ్రనేతలే ఉగ్రవాదుల లక్ష్యం!

టీవల పట్టుబడ్డ ఇస్లామిక్‌ ర్యాడికల్‌ సంస్థ హిజ్బుత్‌ తహ్రీర్‌ సభ్యులు హైదరాబాద్‌, భోపాల్‌లో బీజేపీ అగ్రనాయకులను లక్ష్యంగా చేసుకున్నట్లు,  దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు మధ్యప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌(ఏటీఎస్‌) ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం ప్రధాన నిందితులు మహమ్మద్‌ సలీం, జిమ్‌ ట్రైనర్‌ యాసీర్‌ఖాన్‌లు వాట్సాప్‌, టెలిగ్రామ్‌ యాప్‌లలో కాల్స్‌తోపాటు డార్క్‌వెబ్‌ యాప్‌లను వినియోగించేవారని తేలింది.

లెబనాన్‌, సిరియా వంటి దేశాల్లో ఉండే హిజ్బుత్‌ తహ్రీర్‌ అగ్రనేతలు వాయిస్‌ నోట్స్‌ ద్వారా ఆయా యాప్‌లలో సలీంకు ఆదేశాలు పంపేవారని, అందుకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు జరిగేవని తేలింది. నిఘా సంస్థలు సరైన సమయంలో వీరి కుట్రను గుర్తించాయని, లేకుంటే త్వరలో విధ్వంసాలు ప్రారంభమయ్యేవని ఏటీఎస్‌ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటి వరకు అరెస్టయిన 16 మంది నిందితులు మధ్యప్రదేశ్‌లోని రైసన్‌ అడవుల్లో ఎయిర్‌ గన్స్‌, ఎయిర్‌ పిస్టళ్లతో శిక్షణ పొందారని ఏటీఎస్‌ దర్యాప్తులో తేలింది. ఈ సంస్థ రసాయన, జీవాయుధాల్లోనూ శిక్షణనిస్తుందని తేలడంతో ఆ కోణంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా మీడియా  తెలిపారు.

అయితే, రైసన్‌ అడవుల్లో ఫైరింగ్‌తోపాటు, ఎలాంటి శిక్షణ ఇచ్చేవారనేది ఇంకా తేలాల్సి ఉన్నట్లు తెలిసింది. ‘‘నిందితులను సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ కోసం హైదరాబాద్‌ తీసుకెళ్లాం. గురువారమే వారిని తిరిగి భోపాల్‌కు తీసుకువచ్చాం. శుక్రవారంతో వారి కస్టడీ ముగుస్తుంది” అని ఓ అధికారి తెలిపారు.  నిందితులు చాలా వరకు విచారణకు సహకరించకపోవడంతో సాంకేతిక ఆధారాల మేరకు వారిని ప్రశ్నిస్తున్నామని చెప్పారు.

మరోమారు వారిని కస్టడీకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్‌ వేస్తామని వెల్లడించారు. ఏటీఎస్‌ చీఫ్‌ ఆదర్శ్‌ కతియార్‌ స్వయంగా దర్యాప్తును పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. నిందితులు హైదరాబాద్‌, భోపాల్‌కు చెందిన పలువురు బీజేపీ అగ్రనేతలను లక్ష్యంగా చేసుకున్నట్లు తేలిందని, ఆయా వివరాలను సంబంధిత నేతలకు పంపామని పేర్కొన్నారు. నిందితులు అందుకోసమే ఎయిర్‌గన్స్‌తో ప్రాక్టిస్‌ చేశారని చెప్పారు.

భోపాల్ రైల్వేస్టేషన్‌ను పేల్చేయాలని

భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వేస్టేషన్‌ను పేల్చివేయడానికి సలీం బృందం కుట్ర పన్నినట్లు ఏటీఎస్‌ గుర్తించింది. అందుక్కారణం హబీబ్‌గంజ్‌ రైల్వేస్టేషన్‌ పేరును మార్చడం, ప్రధాని నరేంద్ర మోదీ రాణి కమలాపతి రైల్వేస్టేషన్‌ను ప్రారంభించడమే.  ఇందుకోసం రైల్వేస్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోతీలాల్‌ నెహ్రూ స్టేడియం నుంచి జైల్‌రోడ్డు, అరేరాహిల్స్‌ మీదుగా హిజ్బుత్‌ తహ్రీర్‌ మూకలు రెక్కీ నిర్వహించాయని ఏటీఎస్‌ నిగ్గుతేల్చింది.

వీరంతా పరస్పరం వాట్సాప్‌, టెలిగ్రామ్‌ కాల్స్‌లో మాట్లాడుకునేవారని, విదేశాల్లో ఉండే హిజ్బుత్‌ తహ్రీర్‌ మూకలతో డార్క్‌వెబ్‌లో లభించే ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ యాప్స్‌ను వాడేవారని, రాకెట్‌చాట్‌, శ్రీమ, జూమ్‌ మీటింగ్‌ వంటి యాప్‌లలోనూ ఆడియో/వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించారని ఏటీఎస్‌ నిర్ధారించింది.

సలీం, యాసీర్‌లకు విదేశాల్లోని హిజ్బుత్‌ మూకలు వాయిస్‌ నోట్స్‌ ద్వారా ఆదేశాలు జారీ చేసేవారని, వాటికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు చేసేవారని తేల్చింది. ఈ మూకలు పరస్పరం చేసుకున్న చాటింగ్‌లో ‘బిర్యానీ’, ‘లడ్డూ’, ‘దానిమ్మ’ అని పలు కోడ్‌ పదాలను వాడినట్లు ఏటీఎస్‌ వర్గాలు తెలిపాయి. వాటిని డీకోడ్‌ చేస్తున్నట్లు వివరించాయి. అయితే, బిర్యానీ అంటే హైదరాబాద్‌ నగరమని, లడ్డూ అంటే తిరుపతి లేదా ముంబై అయ్యి ఉండొచ్చని, దానిమ్మ అంటే షోలాపూర్‌ అని ఏటీఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

డాక్టర్‌ కమల్‌ కోసం వేట

సౌరభ్‌ రాజ్‌వైద్యకు బ్రెయిన్‌వా్‌ష చేసి సలీంగా మార్చిన డాక్టర్‌ కమల్‌ కోసం ఇప్పుడు మధ్యప్రదేశ్‌ పోలీసులు వేట సాగిస్తున్నారు. ‘‘ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకున్నాం. డాక్టర్‌ కమల్‌ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటైంది. అతను పనిచేసిన కళాశాల నుంచి సిట్‌ వివరాలను సేకరిస్తోంది” అని  హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా చెప్పారు.

 డాక్టర్‌ కమల్‌ ఎక్కడున్నాడో తెలియకున్నా అతని బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు లభ్యమయ్యాయని తెలిపారు. 2010లో ఇస్లాంను స్వీకరించిన సలీం 2014 కల్లా కరడుగట్టిన ఇస్లామిక్‌ ర్యాడికలిస్టుగా మారాడని ఏటీఎస్‌ గుర్తించింది. తొలుత తన వర్గం వారిని టార్గెట్‌గా చేసుకుని, మతమార్పిళ్లకు పాల్పడ్డాడని తేల్చింది.

ఈ క్రమంలో తన మేనల్లుడు, ఇతర బంధుమిత్రలను కూడా ఇస్లాంలోకి మారాలని సూచించగా, వారు నిరాకరించారని తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో బలవంతపు మతమార్పిడుల నిరోధక చట్టం అమల్లోకి రాగానే సలీం అక్కడ తన పప్పులుడకవని గుర్తించి, హైదరాబాద్‌కు మకాం మార్చినట్లు ఏటీఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.

హైదరాబాద్‌లో సలీం ఇచ్చే ఉపన్యాసాల వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోను బట్టి అతను ఇస్లామేతరులను మతమార్పిళ్లకు ప్రోత్సహించడం, ముస్లింలను కరడుగట్టిన ర్యాడికలిస్టులుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది.