మధ్యప్రాచ్యంలో తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికా ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంపై దాడి చేయడంతో, దానికి ప్రతిగా ఇరాన్ కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికన్ లక్ష్యాలపై క్షిపణులు, డ్రోన్‌లతో దాడులు చేయడంతో, అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం మరోసారి పెను ప్రమాదంలో పడింది. ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన సముద్ర మార్గాలలో ఒకటైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ ప్రవేశద్వారం వద్ద ఖేష్మ్ ద్వీపం నెలకొని ఉంది.
ఈ సంఘర్షణకు విస్తృత ముగింపు పలికేందుకు ఇరు దేశాల అధికారులు చర్చలు కొనసాగిస్తున్నప్పటికీ, ఇరాన్, అమెరికాల మధ్య ఉన్న ఈ పెళుసైన కాల్పుల విరమణ ఒప్పందం పరస్పర సైనిక చర్యల వల్ల పదేపదే ఒత్తిడికి గురవుతుంది. దౌత్యపరమైన సంప్రదింపులు కొనసాగుతున్నప్పటికీ, ఇరు పక్షాలు ఒక ఒప్పందానికి ఎంత దగ్గరగా ఉన్నాయో స్పష్టంగా తెలియడం లేదు. శని, ఆదివారాల్లో ఇరాన్‌లోని గెరుక్ నగరం సమీపంలో, ఖేష్మ్ ద్వీపంపై దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.
ఈ దాడులలో వైమానిక రక్షణ వ్యవస్థలు, ఒక డ్రోన్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, ఆ ప్రాంతంలో నౌకాయానానికి ముప్పుగా పరిణమించిన రెండు దాడి డ్రోన్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. మరోవంక, కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడుల్లో అమెరికా ఐదవ నౌకాదళ స్థావరం, ఒక వైమానిక స్థావరం లక్ష్యంగా చేసుకుంది.
ఇటీవల అమెరికా ఇరాన్‌కు చెందిన ఖేష్మ్ ద్వీపంలోని సైనిక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, టెలికమ్యూనికేషన్ యాంటెన్నా, ఒక ఆయిల్ ట్యాంకర్‌పై దాడులు జరిపిన నేపథ్యంలో, వాటికి ప్రతీకారంగానే ఈ చర్య చేపట్టినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ మిత్రదేశాలతో కలిసి ఇరాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు అమెరికా ప్రకటించింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను తమ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చెబుతున్నారు.
ఇరాన్ ఈ దాడులకు హజ్ ఖాసెం క్షిపణులు, అత్యాధునిక డ్రోన్లను ఉపయోగించినట్లు ప్రకటించారు. ఇరాన్ కువైట్‌లో అమెరికా సైనిక బలగాలు ఉన్న ‘అలీ అల్ సలేమ్ ఎయిర్ బేస్’ను టార్గెట్ చేసింది. ఈ దాడుల్ని కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తిప్పికొట్టింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను గాల్లోనే అడ్డుకున్నారు. భారీ పేలుళ్లు వినిపించడంతో తమ కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ క్షిపణులను, డ్రోన్‌లను అడ్డుకున్నాయని కువైట్ తెలిపింది.
అయితే కూలిన క్షిపణుల శిథిలాలు కారణంగా కొందరు గాయపడగా, ఆస్తి నష్టం సంభవించిందని చెబుతున్నారు. ప్రజలు క్షిపణుల శకలాలు, అనుమానాస్పదంగా ఉండే వస్తువుల దగ్గరకు వెళ్లొద్దని సైన్యం హెచ్చరించింది. అధికారులు జారీ చేసిన సూచనల్ని పాటించాలని అప్రమత్తం చేశారు. ఒకవేళ ఏవైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే 112 అత్యవసర హాట్‌లైన్ ద్వారా అధికారులకు సమాచారం ఇవ్వాలని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కల్నల్ సౌద్ అబ్దుల్ అజీజ్ అల్-ఒతైబి పౌరుల్ని కోరారు.
ఇరాన్ పొరుగు దేశాలపై బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించిందని, కానీ ఆ క్షిపణులు లక్ష్యాలను ఛేదించడంలో విఫలమయ్యాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇరాన్ కువైట్ వైపు ప్రయోగించిన రెండు క్షిపణులు వాటి లక్ష్యాలను చేరలేదని, బహ్రెయిన్ వైపు ప్రయోగించిన మూడు క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ వైమానిక దళాలు వెంటనే అడ్డుకున్నాయని కూడా అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ తెలిపింది.
ఇరాన్ ప్రయోగించిన మూడు డ్రోన్‌లను యూఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు కూల్చివేశాయని ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా దళాలు ఖేష్మ్ ద్వీపంలో సైనిక చర్య చేపట్టాయని సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. ఈ ఉద్రిక్తల మధ్య తమ బలగాలు అలర్ట్‌గా ఉన్నాయని తెలిపారు. దాడుల్ని ఎదుర్కోవడానికి, అమెరికా ప్రయోజనాలు, మిత్ర దేశాలను కాపాడటానికి తమ దళాలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. కాల్పుల విరమణ సమయంలో ఇరాన్ ఇలా చేయడం సరికాదని పేర్కొంటూ అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు అప్రమత్తంగా మరియు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

More Stories
మమతాకు ముఖం చాటేసిన టిఎంసి ఎంపీలు, ఎమ్యెల్యేలు
అమరవీరుల కలలు కన్న తెలంగాణ నిర్మాణంలో వెనుకబడ్డాం
సీబీఎస్ఈలో భారీ ప్రక్షాళన.. చైర్మన్, కార్యదర్శుల మార్పు!