అమరవీరుల కలలు కన్న తెలంగాణ నిర్మాణంలో వెనుకబడ్డాం

అమరవీరుల కలలు కన్న తెలంగాణ నిర్మాణంలో వెనుకబడ్డాం
తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారని పేర్కొంటూ ఈ పోరాటంలో అసువులు బాసిన అమరవీరులు కలలు కన్న తెలంగాణను నిర్మించుకోవడంలో ఇప్పుడు కాస్త వెనుకబడ్డామని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలోనీ తెలంగాణ భవన్ లో జరిగిన తెలంగాణ అవతరణ వేడుకల్లో పాల్గొంటూ భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి కోసం, అమర వీరులు కలలు కన్న తెలంగాణను నిర్మించుకునేందుకు బీజేపీ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. 
 
తెలంగాణ సాధనలో తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు చేసిన కృషి కూడా మరువలేనిదని, పార్లమెంటులో ఆమె తెలంగాణ కోసం గొంతెత్తి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని ఆయన గుర్తు చేశారు. జార్ఖండ్ ఏర్పాటు చేసేటప్పుడు కూడా ఆర్జేడీ పార్టీ అనవసర రాద్ధాంతం చేసిందని, కానీ జార్ఖండ్ ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. 

“కాంగ్రెస్ 1969లో దమన కాండ జరిపింది. ఎంతో మంది విద్యార్థుల మరణానికి కారణమైంది. కానీ బీజేపీ మాత్రం తెలంగాణ  ఏర్పాటులో ఇచ్చిన మద్దతు చాలా గొప్పది. 1997లో కాకినాడలో బీజేపీ ఏర్పాటు చేసిన సభలో కూడా. తెలంగాణ ఏర్పాటు గురించి స్పష్టంగా హామీ ఇచ్చాం. అప్పుడు కేవలం రాజకీయంగా చేసిన వాగ్దానం కాదు  తెలంగాణ కోసం బీజేపీ  సంకల్పంతో చెప్పిన మాటలు” అని స్పష్టం చేశారు.

తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ప్రజల సంస్కృతిని కాపాడేందుకు బీజేపీ కృషి చేస్తుందని నితిన్ నబీన్ హామీ ఇచ్చారు. 2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించి మోసం చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుందని పేర్కొంటూ దీంతో తెలంగాణలోని అనేక మంది యువతీ  యువకులు తమ ప్రాణత్యాగాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత 12 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం,  వికసిత భారత్ లో తెలంగాణను  భాగస్వామ్యం చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నామని తెలిపారు. 31 లక్షల మంది తెలంగాణ రైతులకు పీఎం కిసాన్ యోజన నిధులు, 75 లక్షలకు పైగా లబ్ధిదారులకు ముద్ర యోజన రుణాలు, 1.27 కోట్ల జనధన్ ఖాతాలు, ఆయుష్మాన్ కార్డులను అందజేశాం. రైల్వే,  రోడ్డు ప్రాజెక్టులను భారీగా తెలంగాణకు మంజూరు చేశామని వివరించారు. బీబీనగర్ లో ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థను ఇచ్చామని చెప్పారు.

2047 నాటికి వికసిత భారత్ సాధించాలన్న  లక్ష్యంతో పాటు సమృద్ధ తెలంగాణ ఏర్పాటు చేసేందుకు పాటుపడతామని బిజెపి అధ్యక్షుడు స్పష్టం చేశారు.  రాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతం పాడి, తెలంగాణ అమరవీరులు కలలు కన్న తెలంగాణను పునర్మించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.  తెలంగాణను కొందరు ఏటీఎంలాగా మార్చుకుని, కాంగ్రెస్ జేబులు నింపుతున్నారని మండిపడుతూ దీన్ని ఆపేందుకు భవిష్యత్తులో బీజేపీ కార్యకర్తలంతా కలసి పోరాడుతామని ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి వికాసానికి పాటుపడుతామని చెప్పారు. 

“అప్పట్లో ఒక్క తెలంగాణ నుంచి ఒక్క బీజేపీ ఎంపీ కూడా లేరు. కానీ దేశంలోని బీజేపీ ఎంపీలంతా తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీని నిలదీసి తెలంగాణకు మద్దతు పలికారు. సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో గ్రామాల నుంచి పట్టణాల వరకు బీజేపీ పోరాడింది. ఢిల్లీలో కూడా భారీ ఉద్యమం చేస్తే.. అప్పటి కాంగ్రెస్ పార్టీ టియర్ గ్యాస్, లాఠీచార్జ్ చేసింది” అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
 
కాంగ్రెస్ పార్టీ అప్పట్లో తెలంగాణ ఉద్యమం విషయంలో రెండు నాల్కల ధోరణితో వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ఒక వైపు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తెలంగాణ బిల్లును ఆపేందుకు పార్లమెంటులో మిర్చి  పౌడర్ చల్లుతూ పెప్పర్  స్ప్రే ప్రయోగించారని గుర్తు చేశారు.  తెలంగాణను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కానే కాదు.. తెలంగాణ ప్రజలు ఆ పార్టీ మెడలు వంచి తెచ్చుకున్నారని స్పష్టం చేశారు. 

ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన నేపథ్యంలో, ఇప్పుడు మన ప్రయాణం మరింత అభివృద్ధి, ప్రగతి వైపు సాగాలని రాష్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ‘వికసిత్ భారత్’ (వికసిత భారతదేశం) అనే బృహత్ సంకల్పంలో భాగంగా మనమంతా కలిసికట్టుగా ‘వికసిత్ తెలంగాణ’ లక్ష్యం కోసం కృషి చేయాలని కోరారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న సోదరభావాన్ని, బంధాన్ని ప్రస్తావిస్తూ రెండు రాష్ట్రాలు పరస్పర స్నేహంతో, ఆరోగ్యకరమైన అభివృద్ధి పోటీతో ముందుకు సాగాలని రాంచందర్ రావు సూచించారు.  “తెలుగు ప్రజలమైన మనకు రెండు రాష్ట్రాలు ఉన్నాయి. మన మధ్య ఎటువంటి ద్వేషాలు, విభేదాలు ఉండకూడదు.. కేవలం అభివృద్ధిలో మాత్రమే ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి” అని తేల్చి చెప్పారు.